Sitaram Yechury's Last Wish: సీతారాం ఏచూరి చివరి కోరిక అదేనా ?

Update: 2024-09-12 14:43 GMT

Sitaram Yechury's Last Wish: 23 ఏళ్ల యువకుడిగా ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ జండా పట్టిన సీతారాం ఏచూరి బతికినంత కాలం ప్రజల కోసం ప్రజా ఉద్యమాలకే అంకితమయ్యారు. బతికున్నంత కాలం ప్రజాజీవితంతో ఎనలేని బంధాన్ని పెనవేసుకున్న ఆయన.. ఈ లోకాన్నీ వీడిన తరువాత కూడా మరో నలుగురికి ఉపయోగపడనున్నారు. సీతారాం ఏచూరి జీవితశైలి, ఆయన ఎంచుకున్న మార్గం, ఒకసారి నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కట్టుబడిన మనస్తత్వం, రాజీలేని పోరాటం... ఇవన్నీ ఆయన్ని మిగతావారికంటే ప్రత్యేకం చేస్తాయి. బతికినంత కాలం యువతరానికి ఆయన కమ్యునిజం పాఠాలు చెబితే.. చనిపోయిన తరువాత కూడా ఆయన దేహం రాబోయే వైద్య నిపుణులకు పాఠాలు చెప్పాలనుకుంటోంది.

ఔను, సీతారాం ఏచూరి పార్థివదేహాన్ని ఆయన కుటుంబసభ్యులు ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి డొనేట్ చేశారు. వైద్య విద్యార్థుల బోధన, పరిశోధన నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీతారాం ఏచూరి కుటుంబసభ్యులు తెలిపారు. సీతారాం ఏచూరి చివరి కోరిక ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇంతకీ డెడ్ బాడీతో ఏం చేస్తారు?

మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుతున్న విద్యార్థులకు నేరుగా మానవ శరీరంపై ప్రయోగాలు చేసేందుకు డెడ్ బాడీ ఉపయోగపడుతుంది. మృతదేహాలతో ప్రొఫెసర్స్ మెడిసిన్ చదివే విద్యార్థులకు హ్యూమన్ అనాటమి గురించి లోతుగా వివరిస్తారు. అప్పటివరకు తరగతి గదిలో బోర్డుపైనో లేక డిజిటల్ క్లాసుల్లోనో లేదంటే... మానవ అవయవాలను పోలి ఉన్న బొమ్మలపై మాత్రమే ప్రయోగాలు చూసిన మెడిసిన్ విద్యార్థులకు ఈ మృతదేహంపై ప్రయోగాలు, తరగతులు వారిలో విద్యా నైపుణ్యాన్ని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్తాయి. ఇదంతా కూడా మెడిసిన్ విద్యార్థుల వరకు మాత్రమే. ఇక పరిశోధకుల స్థాయికి వెళ్తే.. వివిధ కోణాల్లో వారు చేసే ప్రయోగాలకు మృతదేహాలు ఉపయోగపడే తీరు మరోస్థాయిలో ఉంటుంది.

ప్రాణం లేకున్నా.. దేహం పనికొస్తుంది..

అన్నదానం, డబ్బు దానం, ధాన్యం దానం, రక్తదానం, విద్యాదానం, అవయవదానం.. ఇలా అన్నిరకాల దానాలు తరచుగా చూసేవే. అలాగని ఇవేవి తక్కువ అని కూడా కాదు. కానీ చనిపోయిన తరువాత దేహం మొత్తాన్నే దానం చేయడం అనేది ఉంటుంది చూశారు... నిస్వార్థంగా ఆ నిర్ణయం తీసుకునే ఆలోచన మాత్రం అతికొద్దిమందికే ఉంటుంది. ప్రాణం ఉన్నంతవరకే కాదు.. ప్రాణం లేని దేహం కూడా పరిశోధనలకు ఉపయోగపడాలి అనే గొప్ప ఆశయంలోంచి మాత్రమే అలాంటి గొప్ప ఆలోచనలు వస్తాయి. అందుకు వారి కుటుంబసభ్యులు కూడా సహకరించాలి. సీతారాం ఏచూరి పార్థివదేహాన్ని ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి దానం చేసే విషయంలో ఆ కుటుంబం చేసింది కూడా అదే అంటున్నారు వాళ్లు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందించేవాళ్లు.  

Tags:    

Similar News