హైద్రాబాద్ లో గణేష్ లడ్డూల వేలం పాటలో రికార్డ్ ధరలు
Ganesh Laddu Auction: హైద్రాబాద్ బండ్లగూడ జాగీర్ లో గణేష్ లడ్డూ వేలం పాటలో రూ. 1.87 కోట్ల ధర పలికింది.
Ganesh Laddu Auction: హైద్రాబాద్ బండ్లగూడ జాగీర్ లో గణేష్ లడ్డూ వేలం పాటలో రూ. 1.87 కోట్ల ధర పలికింది. వినాయకచవితి నవరాత్రుల సందర్భంగా పూజలందుకున్న లడ్డూను వేలం పాటలో దక్కించుకునేందుకు చాలా మంది పోటీపడతారు. బాలాపూర్ లడ్డూ వేలం పాట కూడా నగరంలోని ఇతర ప్రాంతాలపై ప్రభావం చూపుతోంది.
గత ఏడాది ధరను బ్రేక్ చేసిన బండ్లగూడ జాగీర్ గణేష్ లడ్డూ
బండ్లగూడ జాగీర్ లోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో గణేష్ లడ్డూను కమ్యూనిటీవాసులు రూ. 1.87 కోట్లకు దక్కించుకున్నారు. అయితే గత ఏడాది ఈ లడ్డూ ధర రూ.1.26 కోట్లు పలికింది. వేలం పాటలో వచ్చిన డబ్బును పేదల కోసం ఖర్చు చేస్తారు. గత ఏడాది హైద్రాబాద్ మాదాపూర్ మై హోమ్ భుజాలో లడ్డూ ధర రూ. 25.50 లక్షలు పలికింది. అంతకు ముందు ఏడాది అంటే 2022లో 18.50 లక్షలు పలికింది. ఈ ఏడాది ఖమ్మం జిల్లాకు చెందిన కొండపల్లి గణేస్ రూ. 29 లక్షలకు ఈ లడ్డూను దక్కించుకున్నారు.
బాలాపూర్ లడ్డూవేలం పాట ప్రభావం
హైద్రాబాద్ బాలాపూర్ లడ్డూ వేలం పాట 1994లో ప్రారంభమైంది. 1994లో రూ.450తో ప్రారంభమైన వేలం పాట ప్రస్తుతం లక్షల్లోకి చేరింది. రాజకీయ నాయకులు, రియల్ ఏస్టేట్ వ్యాపారులు లడ్డూను దక్కించుకునేందుకు వేలంపాటలో పాల్గొనడంతో ప్రతి ఏటా దీని దర పెరుగుతూ వస్తోంది. 1994 నుంచి 2002 వరకు వేలల్లోనే లడ్డూ ధర పలికింది. కానీ, 2002లో ఈ లడ్డూ ధర లక్ష రూపాయాలు దాటింది. అప్పట్లో కందాడ మాధవరెడ్డి రూ.1.05 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. అప్పటి నుంచి లడ్డూ ధర ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది రూ.30 లక్షల వెయ్యి రూపాయాలకు కొలను శంకర్ రెడ్డి ఈ లడ్డూను దక్కించుకున్నారు. ఈ వేలంపాటలో వచ్చిన డబ్బును గ్రామాభివృద్ది కోసం ఖర్చు చేస్తారు. బాలాపూర్ లడ్డూ వేలం పాట ప్రభావం నగరంలోని ఇతర ప్రాంతాలపై కన్పిస్తోంది.
గణేష్ లడ్డూను వేలంపాటను దక్కించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే వేలంపాటలో లడ్డూను దక్కించుకునేందుకు పోటీ పడుతారు.