Vanamahotsav program in Singareni: సింగరేణిలో వనమహోత్సవ్..సింగరేణి సీఎండీ శ్రీధర్
Vanamahotsav program in Singareni: తెలంగాణ రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా రూపొందించేందుకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే
Vanamahotsav program in Singareni: తెలంగాణ రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా రూపొందించేందుకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సింగరేణిలో సంస్థ ఆధ్వర్యంలో వనమహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, ఇందులో భాగంగానే 35 లక్షల మొక్కలను నాటుతామని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న కోలిండియా, సింగరేణి, ఇతర బొగ్గు లిగ్నైట్ కంపెనీల చైర్మన్లు, ఎండీలతో కేంద్ర బొగ్గుశాఖ ప్రత్యేక కార్యదర్శి అనిల్‌కుమార్‌జైన్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో హైద్రాబాద్‌లోని సింగరేణి భవన్ నుంచి సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ పాల్గొన్నారు.
పర్యావరణహిత చర్యగా నిర్వహిస్తున్న 'వనమహోత్సవ్' కార్యక్రమంలో ప్రతీ బొగ్గు ఉత్పత్తి సంస్థ విధిగా మొక్కలు నాటాలని అనిల్‌కుమార్‌జైన్ ఆదేశించారు. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ శ్రీధర్ మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి సింగరేణివ్యాప్తంగా 'వనమహోత్సవ్' (హరితహారం) కార్యక్రమాన్ని ఒకేసారిగా 15 ప్రదేశాల్లో పెద్దఎత్తున చేపడుతున్నామని తెలిపారు. దీంతో అనిల్‌కుమార్‌జైన్ శ్రీధర్‌ను అభినందించారు. ఈ ఏడాది 804 హెక్టార్లలో 35.47 లక్షల మొక్కలను నాటేందుకు సింగరేణివ్యాప్తంగా ఉన్న 11 నర్సరీల్లో వీటిని పెంచుతున్నామని పేర్కొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సింగరేణి నుంచి అడ్వైజర్ (ఫారెస్ట్రీ) కె.సురేంద్రపాండే, డైరెక్టర్ (పి&పి) బి.భాస్కర్ రావు (బెల్లంపల్లి), జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ కె.రవిశంకర్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'తెలంగాణకు హరితహారం' కార్యక్రమంలో భాగంగా సింగరేణి సంస్థ ఐదేళ్లుగా ఏడాదికి 65 నుండి 70 లక్షల మొక్కలను స్వయంగా నాటుతోందని, 30 లక్షల మొక్కలను సమీప గ్రామాలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నదని వివరించారు. కోలిండియా పరిధిలోగల ఎనిమిది బొగ్గు ఉత్పత్తి కంపెనీలు అన్నీ కలిసి 40 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే, 2.5 లక్షల పండ్లనిచ్చే మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేసినట్లు శ్రీధర్ వివరించారు.