ఈడీ చేతికి గొర్రెల స్కామ్ నివేదిక

మాజీ డైరెక్టర్ ని అదుపులోకి తీసుకునే అవకాశం

Update: 2024-10-05 08:43 GMT

ఈడీ చేతికి గొర్రెల స్కామ్ నివేదిక

గొర్రెల స్కాంలో అర్హులైన లబ్దిదారుల జాబితా ఈడీకి అందింది. పశు సంవర్థక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ తో పాటు మోహినొద్దిన్, ఇక్రముద్దీన్ కూడా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించే అవకాశం ఉంది.ఈడీ అధికారులు తెలంగాణలో గొర్రెల స్కాంపై జూన్ 13, 2024న కేసు నమోదు చేశారు.

ఈ స్కీంలో లబ్దిదారులు, గొర్రెల విక్రయదారులు, రవాణాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులు పశుసంవర్ధకశాఖాధికారులను కోరారు. ఈడీ అధికారుల అభ్యర్థన మేరకు జిల్లాల వారీగా లబ్దిదారుల వివరాలను అధికారులు అందించారు. అయితే ఈ జాబితా ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. ఏసీబీ కేసు ఆధారంగానే ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ఇందులో మనీలాండరింగ్ జరిగిందని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసును విచారించాలని ఈడీని కోరారు. దీంతో ఈడీ రంగంలోకి దిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి గుంటుూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 18 మంది గొర్రెల పెంపకందారులు హైద్రాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో జనవరి 26, 2024లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గొర్రెల పథకంలో భాగంగా తాము గొర్రెలకు అమ్మితే తమకు కాకుండా మధ్యదళారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశారని ఆ ఫిర్యాదులో చెప్పారు. ఈ ఫిర్యాదుపై ఐపీసీ 406, 409, 420 సెక్షన్ల కింద కేసు నమోదైంది.

గొర్రెలు, మేకలు పెంచుకోవడం ద్వారా జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకంలో అవకతవకలు జరిగాయి. ఏసీబీ అధికారులు ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరిని అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News