Hyderabad Gandhi Hospital: నిండు ప్రాణం తీసిన వైద్యుల నిర్లక్ష్యం

Telangana: కొడుకుకి తల్లిని దూరం చేసిన సిబ్బంది అలసత్వం * మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్‌కు చెందిన జయమ్మకు కరోనా

Update: 2021-04-21 08:11 GMT

గాంధీ హాస్పిటల్ (ఫైల్ ఇమేజ్)

Hyderabad Gandhi Hospital: నిర్లక్ష్యం నిండు ప్రాణం తీసింది. వైద్యుల అలసత్వం ఓ కొడుకుకి తల్లిని దూరం చేసింది. మా అమ్మ ప్రాణాలు కాపాడండి అంటూ ఆ కొడుకు పడే వేదన ఏ వైద్యుడికి వినిపంచలేదు. ఏ వైద్యాధికారి కరుణించలేదు. కనీసం మానవత్వం చూపించలేదు. ఊపిరాడక తన తల్లి కళ్లముందే చనిపోతుంటే ఆ బిడ్డ పడే యాతన వర్ణానాతీతం. తన తల్లి కోసం ఆ పేగుబంధం పడే వేదనను చూస్తే గుండెలవిసిపోతాయి.

కరోనా రోగుల కోసం వంద కోట్లు వెచ్చించాం. బెడ్స్ పుష్కలంగా ఉన్నాయి. మందులకు డోకా లేదు. అని గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఓ‌ తల్లి ప్రాణాలు కాపాడలేకపోయింది. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ జగన్‌గూడకు చెందిన మాదాసు జయమ్మకు కరోనా సోకింది. వైద్యులు సూచించిన మందులు వాడుతూ వస్తోంది. ఐనా జయమ్మ ఆరోగ్యం క్షీణించింది. శ్వాస కూడా అందడం లేదు. దీంతో ఆమె కుమారుడు ప్రదీప్‌ ఆమెను అంబులెన్స్‌లో ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ వాళ్లు గేట్‌ దాటనివ్వకుండా వెనక్కి పంపించారు. మరో ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడే అదే పరిస్థితి.

నేరుగా అంబులెన్స్‌ను గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చాడు. అంబులెన్స్‌లో ఉన్న తన తల్లి ఊపిరాడక కొట్టుమిట్టాడుతుంది. తన కొడుకు ఆఘమేఘాలమీద వైద్య సిబ్బంది వద్దకు పరుగులు తీశాడు. తన తల్లి పడే వేదనను వివరించాడు. ఐనా వాళ్లలో చలనం లేదు. పేషెంట్ పరిస్థితిని అర్థం చేసుకోకుండా పాజిటివ్ రిపోర్ట్స్‌ చూపించాలంటూ మెలిక పెట్టారు. తన తల్లిని కాపాడాలంటూ కాళ్లవేళ్ల పడ్డాడు. ఐనా ఏ వైద్యుడు, ఏ అధికారి పట్టించుకోలేదు.

ఇంతలో జరాగాల్సిన ఘోరం జరిగిపోయింది. తల్లి జయమ్మ ఊపిరి ఆగిపోయింది. ఏ ఒక్క వైద్యుడు మానవత్వం ప్రదర్శించినా తన తల్లి ప్రాణాలు దక్కేవని బోరున విలపించాడు. ఈ అసమర్థ ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యమే తన తల్లిని చంపేశాయని ఆ కొడుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన తల్లి ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న సమయంలో ప్రదీప్‌ ఓ సెల్ఫీవీడియో తీశాడు. ఈ వీడియో గాంధీ ఆసుపత్రి వైద్యుల తీరును ప్రశ్నిస్తుంది. ప్రభుత్వ అసమర్దతను కళ్లకుకడుతుంది. 

Tags:    

Similar News