తెలంగాణలో సంక్రాంతి పండుగ తరువాత పాఠశాలలు, కళాశాలలు తెరిచేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. మొదట 9, 10 తరగతులు, తరువాత జూనియర్ కాలేజీలు ప్రారంభం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ లో విద్యాశాఖ తీసుకువచ్చిన ప్రతిపాదన పై ఓ స్టోరి.
కరోనా ఎఫెక్ట్‌తో రాష్ట్రంలో మార్చి 16 నుంచి స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఇప్పటిదాకా ఫిజికల్ క్లాసులు స్టార్ట్ కాలేదు. ఈ విద్యా సంవత్సరం నష్టపోవద్దనే ఆలోచనతో సెప్టెంబర్ నుంచి డిజిటల్, ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. మొదట బతుకమ్మ, దసరా తర్వాత స్కూళ్లు, కాలేజీలు ప్రారంభించాలని సర్కారు భావించింది. కానీ కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో వెనక్కి తగ్గింది. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో స్టార్ట్ చేయాలని విద్యాశాఖ ప్రతిపాదించినా సీఎం కేసీఆర్ ఒకే చెప్పకపోవడంతో వాయిదా పడ్డాయి.
అయితే కరోనా ఎఫెక్ట్‌తో పది నెలలుగా మూసి ఉన్న స్కూళ్లు, కాలేజీలను తిరిగి ఓపెన్ చేసేందుకు రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత విద్యా సంస్థలన్నింటినీ తెరవాలని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ప్రపోజల్స్ సీఎం కేసీఆర్ వద్దకు చేరాయి. మరోవైపు విద్యా సంస్థలను ఓపెన్ చేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. స్కూళ్లు, కాలేజీలు తెరవాలని ఆలోచన ఉన్నా తొమ్మిదో తరగతి పైబడిన విద్యార్దులకే తెరబోతున్నారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు స్టూడెంట్లకు క్లాసులు, ఎగ్జామ్స్ పై మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.