ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. నిర్మాణదారుల అవసరాలను ఆసరాగా చేసుకొని ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అధిక ధరలకు విక్రయాలు జరుపుతూ అక్రమాలకు తెరదీస్తున్నారు. సిండికేటుగా ఏర్పాటై ఇసుక డంప్‌లు ఏర్పాటు చేసి నగరాలకు తరలిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో అక్రమంగా సాగుతున్న ఇసుక రవాణాపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ.
భద్రాద్రి జిల్లాలో వాగులను ఆధారంగా చేసుకొని కొంతమంది అక్రమార్కులు కోట్లు గడిస్తున్నారు. కరకగూడెం పెద్ద వాగు నుంచి రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక రవాణా జరుగుతోంది. దుమ్ముగూడెం మండలం గుబ్బలమంగివాగు, సీతారాంపురం, తూరుబాక, సింగారం, పైడిగూడెం ప్రాంతాల్లో గోదావరి నుంచి నిత్యం ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. అధికారులు దాడులు చేసి జరిమానాలు విధించినా వీరి దందా మాత్రం ఆగడం లేదు.
ఇసుక అక్రమంగా తరలించడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. టీఎస్ఎండీసీ రోజుకు 30 ట్రాక్టర్లకే కూపన్లు ఇస్తున్నా ఇసుకాసురులు మాత్రం లెక్కలేకుండా ఇసుక డంపింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. రామానుజవరం, సాంబాయగూడెం, కొండాయిగూడెం, మల్లెపల్లి గ్రామాల్లో ఇసుక అక్రమంగా నిల్వ చేసి అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరించడంపై మండిపడుతున్నారు.