RTO online services : తీరనున్న వాహనదారుల కష్టాలు..ఆన్‌లైన్‌లోనే ఆర్టీఓ సేవలు
RTO online services : ఇంతకు ముందు వాహనదారులు ఎవరైనా సరే లెర్నింగ్ లైసెన్స్ గడువు ముగిస్తే కొత్తది తీసుకోవాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్ సమయం గడిస్తే దాన్ని రెన్యూవల్ చేయించుకోవాలన్నా, లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా చిరునామా మార్పులు చేసుకోవాలనుకున్నా ఖచ్చితంగా ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో వాహనదారులు ఎక్కువగా కార్యాలయాల చుట్టూ తిరగడానికి భయపడుతున్నారు. ఈ క్రమంలోనే రవాణా శాఖ కూడా ఇలాంటి కొన్ని రకాల సేవలన్నీ ఇకపై ఆన్‌లైన్‌లోనే అందించాలని నిర్ణయించింది.
ఇకపై వాహనదారులు ఇలాంటి అత్యవసర సేవలను ఉపయోగించుకోవాలనుకుంటే కార్యాలయానికి రాకుండానే రవాణాశాఖ వెబ్‌సైట్ ద్వారా పొందేలా ఏర్పాట్లు చేసింది. అన్ని సేవలను ఆన్‌లైన్‌లో అందిస్తూ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ అవసరం లేకుండా అన్ని పత్రాలను జారీ చేస్తోంది. ఆర్టీఓ సేవలను మరింత సరళతరం చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆన్‌లైన్ సేవలు వెంటనే ప్రారంభించాలని ఆ శాఖ కమిషనరేట్ నుంచి ఆదేశాలు అందాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఈ సేవలు పొందేవారికి ఊరట లభించింది.
ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు..
ఇక ఆన్ లైన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలనుకునే వాహనదారులు ముందుగా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వాహనదారులకు అందుబాటులో రోజుకు నిర్ణీత స్లాట్లను ఉంచుతారు. అన్ని డాక్యుమెంట్లతో కూడిన దరఖాస్తులు నేరుగా ఆశాఖ రాష్ట్ర కార్యాలయంలోని సర్వర్‌కు అనుసంధానం అవుతుంది. సంబంధిత డాక్యుమెంట్లను రవాణాశాఖ వెబ్‌సైట్‌లో (www.transport.telangana.gov.in) అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.