నేడు తెలుగు రాష్టాల ఆర్టీసీ అంతరాష్ట్ర ఒప్పందం!

Update: 2020-11-02 03:21 GMT

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపేందుకు మార్గం సుగమం అయినట్లే కనిపిస్తోంది. బస్సులు తిప్పేందుకు అధికారులు చేస్తోన్న ప్రయత్నాలు దాదాపు కొలిక్కి వచ్చాయి. రెండు రాష్ట్రాల ఆర్టీసీలు ఏయే మార్గాల్లో ఎన్ని సర్వీసులు నడపాలో స్పష్టత వచ్చింది. రెండు సంస్థల ఎండీలు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. సాయంత్రం నుంచి అంతర్రాష్ట్ర సర్వీసులు ఆరంభించనున్నట్లు తెలిసింది.

లాక్‌డౌన్‌కు ముందు ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణకు నిత్యం సుమారు వెయ్యికి పైగా సర్వీసులు నడిపేది. ఇప్పుడు ఆ సంఖ్య 638కే పరిమితం కానుంది. 371 సర్వీసులు తగ్గనున్నాయి. టీఎస్‌ఆర్టీసీ గతంలో ఏపీకి 750 సర్వీసులు నడిపేది. ఇప్పుడు 820 వరకు పెరగనున్నాయి. టీఎస్‌ఆర్టీసీ డిమాండు మేరకు లక్షా 61వేల కి.మీ.మేర సర్వీసులకే ఏపీఎస్‌ ఆర్టీసీ అంగీకరించడంతో ఆర్టీసీల ఎండీల మధ్య సోమవారం ఒప్పందం జరగనుంది. అయితే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు బస్సుల పర్మిట్లపై గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి, ఉభయ రాష్ట్రాల రవాణాశాఖల ముఖ్య కార్యదర్శుల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం జరిగేందుకు మరికొంత సమయం పడుతుందని చెబుతున్నారు.

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించటంతో మార్చి 23 నుంచి ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించినప్పటికీ ఇవి పునఃప్రారంభానికి నోచుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీ బస్సుల రాకపోకల కోసం రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసుల ఒప్పందం జరగలేదు. సమన్యాయం ప్రాతిపదికన రెండు రాష్ట్రాలూ కిలోమీటర్లు, సర్వీసులు సమానంగా నడిపేందుకు ఒప్పందం చేసుకున్న తర్వాతే ఏపీకు బస్సులు నడపాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధికారులకు స్పష్టం చేయటంతో బస్సులకు బ్రేకులు పడ్డాయి. చర్చల అనంతరం రెండు రాష్ట్రాల ఆర్టీసీలు కిలోమీటర్లు, సర్వీసుల విషయంలో స్వల్ప వ్యత్యాసంతో సమ న్యాయాన్ని సాధించాయి. భవిష్యత్తులో అవసరమైతే రెండు రాష్ట్రాలు చర్చించుకుని సమన్యాయం ప్రాతిపదికనే కిలోమీటర్లు పెంచుకుంటాయని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News