మునుగోడు బరిలో శ్రీమంతుల కొట్లాట.. ఆస్తుల్లో ఫస్ట్ రాజగోపాల్, సెకండ్ స్రవంతి, థర్డ్ కూసుకుంట్ల..

Munugode Bypolls: మునుగోడు ఉపఎన్నిక అత్యంత ఖరీదైందిగా మారిపోయింది.

Update: 2022-10-14 16:00 GMT

మునుగోడు బరిలో శ్రీమంతుల కొట్లాట.. ఆస్తుల్లో ఫస్ట్ రాజగోపాల్, సెకండ్ స్రవంతి, థర్డ్ కూసుకుంట్ల

Munugode Bypolls: మునుగోడు ఉపఎన్నిక అత్యంత ఖరీదైందిగా మారిపోయింది. ఇంత ఖరీదైన ఎన్నిక బహుశా ఎక్కడా చూడబోమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అత్యంత ఖరీదైన ఎన్నికేనన్న అభిప్రాయాలున్నా అటు పేదల నుంచి, బడుగుల నుంచి కూడా నామినేషన్లు పెద్దఎత్తునే దాఖలయ్యాయి. ఏనుగుల్లాంటి పెద్దమనుషులు కొట్లాడుతున్న ఈ ఎన్నికలో లేగ దూడల్లాంటి బక్కమనుషులు నిలదొక్కుకోగలరా? సరే.. ఆ ప్రశ్నలు ఎలా ఉన్నా మునుగోడులో శ్రీమంతులైన మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఆస్తుల గురించే ఇప్పుడు చర్చంచా నడుస్తోంది.

పార్టీల నేతలంతా ఉపఎన్నిక ఫలితం ఎలా ఉంటుందోనని చర్చించుకుంటుంటే సామాన్యుడు మాత్రం శ్రీమంతుల ఆస్తుల గురించి పెద్దఎత్తున చర్చించుకుంటున్నారు. మునుగోడులో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ అఫిడవిట్లో ప్రకటించిన ఆస్తులు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ వేయడంతో ముక్కోణంలో పోటీ పడుతున్న ముగ్గురు కూడా ఆస్తుల చిట్టాలతో పాటు కేసుల వివరాలు కూడా పబ్లిక్ డొమెయిన్లోకి వచ్చినట్లయింది.

బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఆస్తులు, అప్పులతో పాటు పోలీసు కేసుల వివరాలతో కూడిన ఎన్నికల అఫిడవిట్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అఫిడవిట్ లో పేర్కొన్న ప్రకారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆస్తుల విలువ 222.67 కోట్లుగా తేల్చారు. ఆయన సతీమణి ఆస్తుల విలువ 52.44 కోట్లుగా ఉన్నట్టు వెల్లడించారు. ఈ ఆస్తుల్లో స్థిరాస్తుల విలువ 152.69 కోట్లు.. చరాస్తుల విలువ 69.97 కోట్లుగా రాజగోపాల్ పేర్కొన్నారు. మరోవైపు తనకు 61.5 కోట్లు అప్పులుగా ఉన్నట్లు చూపారు. అయితే 2018 ఎన్నికల సమయంలో రాజగోపాల్ సమర్పించిన అఫిడవిట్ లో ఆయన ఆస్తులు 24.5 కోట్లు మాత్రమే ఉన్నట్టు పేర్కొనడం విశేషం. అఫిడవిట్ ను బట్టి 2018 ఎన్నికల తరువాత ఇప్పటివరకు రాజగోపాల్ రెడ్డి ఆస్తులు ఏకంగా 200 కోట్ల రూపాయలు పెరిగితే ఆయన భార్య లక్ష్మి ఆస్తులు మాత్రం 240 కోట్లు తగ్గిపోయాయి. అయితే లక్ష్మి తన ఆస్తుల్ని పోగొట్టుకున్నారా లేక రాజగోపాల్ రెడ్డి పేరు మీద బదిలీ చేశారా అన్న చర్చ సాగుతోంది.

నల్గొండ జిల్లా బ్రాహ్మణ వెల్లంల, సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో వ్యవసాయ భూములు, రంగారెడ్డి జిల్లా కోకాపేట, ఇతర ప్రాంతాల్లో వ్యవసాయేతర భూములు, హైదరాబాదులో ప్లాట్లు ఉన్నట్టు రాజగోపాల్ పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అఫిడవిట్ లో పేర్కొన్న ప్రకారం ఆమె పేరుపై 25 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా ఆమె భర్త పేరు మీద 15 కోట్లకు పైబడ్డ ఆస్తులున్నట్లు లెక్కలు చూపించారు. బ్యాంకులో స్రవంతి పేరున రూ.6లక్షలు, భర్త పేరున రూ.55 లక్షల అప్పులు చూపించారు. రాజగోపాల్ రెడ్డి తరువాత ఆస్తుల విషయంలో పాల్వాయి స్రవంతి రెండో స్థానంలో ఉన్నారు.

ఇక టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్లో తనకు 7 కోట్ల 69 లక్షల ఆస్తులున్నట్టు పేర్కొన్నారు. అలాగే కోటీ 78 లక్షల అప్పులున్నట్టు చూపించారు. ఆయన భార్య అరుణారెడ్డి పేరిట 6 కోట్ల 10 లక్షల ఆస్తులుండగా దాదాపు 23 లక్షల అప్పులున్నట్టు అఫిడవిట్లో చెప్పుకున్నారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆస్తుల విషయానికొస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టాప్ లో ఉండగా రెండో స్థానంలో పాల్వాయి స్రవంతి, మూడో స్థానంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. మరి ఎన్నికల బరిలో ఎవరు టాప్ లో ఉంటారనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. 

Tags:    

Similar News