farmers protest: రేవంత్ రైతు దీక్ష సక్సెస్
* భారీగా తరలొచ్చిన రైతులు, కార్యకర్తలు * గల్లీలో కాదు.. ఢిల్లీలో చేద్దాం పోరాటం * 24 గంటల్లో బండి సంజయ్ పసుపు రైతుల సమస్యలపై మాట్లాడాలి
పసుపు రైతులు ఢిల్లీ వీధుల్లో కదం తొక్కాలని టీ-పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డి పిలుపు నిచ్చారు. పసుపు బోర్డు హామి పై బీజేపీ నేత రాంమాధవ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన రేవంత్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కాదు అధర్మపురి అర్వింద్ అంటు చురకలు వేశారు. ఆర్మూర్ లో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రైతు దీక్షలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆర్మూర్ లో కాంగ్రెస్ రైతు దీక్ష సక్సెస్ కావడంతో క్యాడర్ లో నయాజోష్ నెలకొంది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో శనివారం కాంగ్రెస్ రైతు దీక్ష నిర్వహించింది. పసుపు రైతు సమస్యల పై కాంగ్రెస్ తలపెట్టిన దీక్షకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలొచ్చారు. ఈ దీక్షలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ, ఎమ్మెల్యే సీతక్క , మాజీ మంత్రులు షబ్బీర్‌అలీ, సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సభకు వచ్చిన ఎంపీ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్ నుంచి ఆర్మూర్ వరకు భారీ వాహనాల కాన్వాయ్ తో ఘన స్వాగతం పలికారు. దారి మధ్యలో రేవంత్ రెడ్డికి పసుపు రైతులు సంఘీభావం తెలిపారు. రైతు దీక్షలో కాంగ్రెస్ నాయకులతో కలిసి రేవంత్ రెడ్డి కూర్చున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానంటూ బాండ్ పేపర్
రాసిచ్చిన ఎంపీ ధర్మపురి అర్వింద్ పై మండిపడ్డారు. ఈ విషయంపై హామీ ఇచ్చిన బీజేపీ నేత రాంమాధవ్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో పోరాటం చేస్తున్న ఉత్తర భారతం రైతుల మాదిరిగా పసుపు బోర్డు కోసం నిజామాబాద్ రైతులు ఢిల్లీ వీధుల్లో కదం తొక్కాలని, ప్రధాని మోడీ మీద ఒత్తిడి తేవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
కేంద్ర వ్యవసాయ చట్టాలపై సీఎం కేసీఆర్ యూటర్న్ తీసుకోవడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమానికి సంఘీభావంగా ప్రతిపక్షాలన్ని పార్లమెంట్ మొదటి రోజు సమావేశాలను బహిష్కరిస్తే టీఆర్ఎస్ మాత్రమే హాజరైందని విమర్శించారు. అసెంబ్లీ- పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్తబ్దుగా మారిన నిజామాబాద్ కాంగ్రెస్ శ్రేణులకు ఆర్మూర్ సభ నయా జోష్ నింపింది.