Revanth Reddy: కామారెడ్డికి పారిపోయి పోటీ చేస్తున్నారు.. తాను ఓడిపోతున్నానని కేసీఆర్ ఒప్పుకున్నట్లే..
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది - రేవంత్ రెడ్డి
Revanth Reddy: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తన పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల లిస్టు చూసిన తర్వాత.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని తనకు సంపూర్ణ విశ్వాసం కలిగిందన్నారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సోనియాగాంధీ నాయకత్వంలో.. మల్లికార్జు ఖర్గే నేతృత్వంలో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుందన్నారాయన.
సిట్టింగులందరికీ బీఆర్ఎస్ సీట్లు ఇవ్వాలని కేసీఆర్‌కు తాను మొదటి నుంచి సవాల్ విసిరానని, నీకు చేతనయితేనే గజ్వేల్‌లో మాత్రమే పోటీ చేయాలని డిమాండ్ చేశానన్నారు. సిట్టింగ్ సీట్లలో మార్పులు చేశారని, కేసీఆర్ గజ్వేల్‌లోనే కాకుండా కామారెడ్డికి పారిపోయి పోటీ చేస్తా అంటున్నాడని ఎద్దేవా చేశారాయన... ఎమ్మెల్యేలందరినీ గెలిపించాల్సిన నాయకుడు రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాడంటే.. ఏదో ఒక నియోజకవర్గంలో ఓడిపోతానని కేసీఆర్ సంపూర్ణంగా నమ్ముతున్నాడని అన్నారు రేవంత్ రెడ్డి.. రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నాడంటేనే.. ఓడిపోతానని ఆయనే స్వయంగా ఒప్పుకున్నట్లే అన్నారాయన.