Revanth Reddy: ఏం చూసి మూడోసారి మోడీకి ఓటు వేయాలి?
Revanth Reddy: బుల్లెట్ ట్రైన్ గుజరాత్‌కు తీసుకెళ్లిన మోడీ.. వికారాబాద్‌కు MMTS రైలు తీసుకురాలేదు
Revanth Reddy: తెలంగాణలో 14 పార్లమెంట్ స్థానాలు గెలవాలని.. పార్టీ గెలుపు కాంగ్రెస్ వంద రోజుల పాలనకు రెఫరెండంగా మారాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గస్థాయి ముఖ్యనేతలతో సమీక్ష సమావేశం నిర్వహించిన రేవంత్.. కాంగ్రెస్‌ను గెలిపించుకుంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. పార్టీకి అండగా నిలబడి సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.రంగారెడ్డి జిల్లా నుంచే లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శంఖారావం పూరించనుందని తెలిపారు రేవంత్ రెడ్డి. తుక్కుగూడ సభ నుంచే ఆరు గ్యారెంటీలు ప్రకటించామని గుర్తుచేస్తూ.. అదే ప్రాంతంలో లోక్‌సభ ఎన్నికలకు గ్యారెంటీ స్కీముల ప్రకటన ఉంటుందని అన్నారు. ఈ జనజాతర సభకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరవుతారని తెలిపారు.
ఇక పదేళ్ల బీజేపీ పాలనపైనా మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ప్రధాని తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శించారు. బుల్లెట్ ట్రైన్ గుజరాత్‌కు తీసుకెళ్లిన మోడీ వికారాబాద్‌కు MMTS రైలు తీసుకురాలేదని... గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసి మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. రీజనల్ రింగ్ రోడ్డు రాకుండా బీజేపీ ఎందుకు మోకాలడ్డుతోందని.. ఏం చూసి మూడోసారి మోదీకి ఓటు వేయాలని రేవంత్ ప్రశ్నించారు.