Revanth Reddy: అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ.. ధరణి పోర్టల్ రద్దు..
Congress Rythu Declaration: వరంగల్ రైతు సంఘర్షణ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.
Congress Rythu Declaration: వరంగల్ రైతు సంఘర్షణ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణ అంటే నినాదం కాదు, ఎన్నికల ముడి సరుకు అసలే కాదన్నారు. తెలంగాణ అంటే ఆత్మగౌరవమని స్పష్టం చేశారు. రెండుసార్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ వ్యవసాయ ఆధారిత కుటుంబాలను చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. తెలంగాణ రైతుల పక్షాన బాధ్యత తీసుకుని కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ తీసుకొస్తోందని రేవంత్ తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతు కూలీలు, భూమి లేని రైతులకు రైతు బీమా వర్తింపజేస్తామన్నారు. అసైన్డ్ భూములు కేటాయించిన దళితులకు భూమిపై హక్కులు కల్పిస్తామని రేవంత్ భరోసా ఇచ్చారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులు సరఫరా, చేసే వారిపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని రేవంత్ వెల్లడించారు. పసుపు రైతులను ఆదుకునేందుకు క్వింటాల్ పసుపును రూ.12వేలకు కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.