Red Alert: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెడ్ అలెర్ట్
Red Alert: జిల్లా వ్యాప్తంగా 17.5 సెం.మీ.వర్షపాతం నమోదు * పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
Red Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలను రెడ్ జోన్‌గా ప్రకటించింది ప్రభుత్వం. తాజాగా.. ఆ లిస్ట్‌లోకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేరింది. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో.. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక.. భారీ వర్షాలతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ముంపు ప్రాంతాలను సందర్శించిన జిల్లా కలెక్టర్.. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు ఎగువన భారీ వర్షాలు పడుతుండటంతో కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి 32వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
భద్రాద్రి ఏజెన్సీలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. అటవీప్రాంతంలోని చింతవాగు, రోటింతవాగుల ద్వారా తాలిపేరులోకి భారీగా వరద వస్తోంది. అప్రమత్తమైన అధికారులు.. ప్రాజెక్ట్ 19 గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 36వేల 700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 73.10 మీటర్ల వద్ద కొనసాగుతోంది. ఇక ఇన్ ఫ్లో 34వేల 900 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 36 వేల 810 క్యూసెక్కులుగా ఉంది.
గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 17.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. మరోవైపు.. పలు పట్టణాలు జలమయమయ్యాయి. ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.