తెలంగాణలో పౌరసరఫరాలశాఖ రేషన్ కోసం మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఓటీపీ విధానం కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. కొత్త విధానంతో సరుకులు పొందాలంటే ఆధార్‌కార్డుకు ఫోన్ నెంబర్ లింకప్ తప్పనిసరి కావడంతో అబ్దిదారులంతా లబోదిబోమంటున్నారు. అంతేకాదు ఆధార్ కేంద్రాలకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. దీంతో రేషన్ కోసం ప్రజలు పరేషాన్ అవుతున్నారు.
నిజానికి ఆదిలాబాద్ లాంటి వెనకబడిన జిల్లాలో చాలామందికి ఫోన్ సౌకర్యం లేదు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఓటీపీ విధానంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అదే విధంగా జిల్లాలో సగం మంది ఫోన్లకు ఆధార్ అనుసంధానం కాలేదు. మిగిలిన వారికి సరకులు అందాలంటే ఐరిస్ విధానంలో తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ఐరిస్ పరికరం ద్వారా కార్డుదారు కనుపాపను స్కాన్ చేయాల్సి ఉంటుంది. వెలుతురు సమయంలో ఆ పరికరం పనిచేయక బియ్యం ఇవ్వడంలో ఇబ్బందులు తలెత్తున్నాయి. వృద్ధులు, కంటి ఆపరేషన్ చేయించుకున్న వారికీ ఐరిస్ తీసుకోవడం లేదు. అలాంటివారు తప్పనిసరి ఓటీపీ కోసం ఆధార్ అనుసంధానం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఓటీపీ లేనివారికి ఐరిస్ ద్వారా సరకులు పంపిణీ చేసే వెసులుబాటు ఉన్నా, వృద్ధులకు ఐరిస్ స్కానింగ్ కాకపోవడంతో అగచాట్లు తప్పడం లేదు. దీంతో తెలంగాణలో ఉన్న ప్రజలు తమకు సరుకులు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు లబ్ధిదారులు.
ఇక జిల్లా వ్యాప్తంగా ఒక లక్షా 88వేల 549 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 94వేల 274 ఫోన్ నెంబర్లకు మాత్రమే ఆధార్ లింక్ అప్ అయ్యాయి. మిగిలిన వారిలో కొంతమందికి సెల్ ఫోన్లు లేక పోవడం.. ఉన్నవాటికి ఆధార్ లింక్ లేదని కారణంగా వారికీ రేషన్ తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి ఫోన్ నెంబర్ లింకప్ చేసుకునేందుకు మూడు నాలుగు రోజులు అటు ఇటు తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ నెల రేషన్ దొరుకుతుందో లేదో అనే ఆందోళన లబ్ధిదారుల్లో వ్యక్తమౌతోంది.