TG News: ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి
TG News: ఇద్దరికీ 14 రోజల జ్యూడీషియల్ రిమాండ్ విధించిన ఏసీబీ కోర్ట్
TG News: రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఆయనతో పాటు కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌రెడ్డి కూడా పట్టుబడ్డారు. ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితా నుంచి భూమి తొలగించేందుకు జాయింట్ కలెక్టర్ 8 లక్షల లంచం డిమాండ్ చేశారు. డబ్బును సీనియర్ అసిస్టెంట్ ద్వారా జేసీ తీసుకున్నారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు దాడి చేసి జేసీ, సీనియర్ అసిస్టెంట్‌ను పట్టుకున్నారు. మరోవైపు నాగోల్‌లోని జేసీ భూపాల్‌రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారుల సోదాలు చేపట్టారు. ఇంటిలో 16లక్షల నగదు, కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అనంతరం ఏసీబీ కోర్టుకు తరలించగా.. 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు ఏసీబీ అధికారులు.
గత మూడేళ్లుగా ఫైల్‌ను మూవ్ చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా.. మదన్‌మోహన్‌రెడ్డి నుంచి స్పందన ఉండేది కాదని.. కావాలనే పక్కకు పెట్టేవారని.. బాధితులు మీడియా ముఖంగా గోడును వెల్లబోసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి అధికారులు చాలా మంది ఉన్నారని.. వారందరినీ గుర్తించి... వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని పలువురు బాదితులు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు లంచం తీసుకునే అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏసీబీ నుంచి తప్పించుకోలేరని ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ అన్నారు. జాయింట్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.