Rajagopal Reddy: రాజగోపాల్‌రెడ్డి అనూహ్యంగా రూటు మార్చారా?
komatireddy Rajagopal Reddy: తెలంగాణలో ఆయనో జాతీయపార్టీ ఎమ్మెల్యే. కానీ ఆయన ఇటీవల జరిగిన అన్ని ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు.
komatireddy Rajagopal Reddy: తెలంగాణలో ఆయనో జాతీయపార్టీ ఎమ్మెల్యే. కానీ ఆయన ఇటీవల జరిగిన అన్ని ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. కనీసం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడైనా పట్టించుకొని ముందుకు రాడు కానీ మిగిలిన సమయంలో తనకంటే ఎవ్వరు పార్టీ లాయల్ కాదంటూ కబుర్లు బాగా చెబుతాడు. అసలు ఆయన సొంత పార్టీలో ఉన్నాడా లేడా అనే అనుమానం ఉందట. ఇదంతా లోలోపల జరుగుతున్న సమయంలోనే మరో షాక్. బీజేపీని అంతలా పొగిడి, సొంత పార్టీ ఇమేజ్‌కి డ్యామేజ్ కలిగించేలా మాట్లాడిన ఆ ఎమ్మెల్యే తర్వాత రాజీపడ్డారట. రూటు మార్చారట. ఇంతగా కలవరపెడుతున్న ఎమ్మెల్యే ఎవరు? ఆయన మార్చి రూటేంటి?
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. మునుగోడు నుంచి కాంగ్రెస్ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే. హస్తం పార్టీలో ఉంటూనే కాంగ్రెస్ నేతలను విమర్శిస్తారు. అదే నోటితో కమలనాథులను ఆకాశానికెత్తుతారు. పనిలో పనిగా టీఆర్‌ఎస్‌నూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతారు. అంతలోనే సైలెంట్‌గా ఉండిపోతారు. ఇంతలా రాజకీయాలు చేసే రాజగోపాల్‌రెడ్డి అనూహ్యంగా రూటు మార్చారు. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీకి సారథ్యం వహిస్తున్న షర్మిళకు కాల్ చేసి మద్దతిచ్చారు. ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటేనే పొలిటికల్ సెన్సేషన్‌కి కేరాఫ్ అడ్రస్. తిట్టాలనుకున్న నేతలను తిట్టిపోస్తారు. అడ్డంగా కడిగి పారేస్తారు. అది ప్రత్యర్థి పార్టీ నేతలైనా సొంత పార్టీ నేతలైనా ఆ బ్రదర్స్‌కు ఎవ్వరైనా ఒక్కటే. దుమ్ము దులిపేస్తారంతే. జిల్లాలో తమకు ఎదురులేకుండా ఎదిగిన కోమటిరెడ్డి బ్రదర్స్ దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నపుడు తిరుగులేని రాజకీయాలు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంచి పట్టు సంపాదించుకున్నారు. వారు చెప్పిందే వేదంగా నడిచిన వైఎస్ హయాంలో ఆయనకు ముఖ్య అనుచరులుగా, కాంగ్రెస్ పార్టీని జిల్లాలో ముందుండి నడిపించారు. కానీ తర్వాత కాలం తిరగబడింది. రాజశేఖర్‌రెడ్డి హఠాన్మరణం తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్ పొలిటికల్ గ్రాఫ్ తగ్గిందన్న చర్చ బాగా తెరపైకి వచ్చింది.
అయినా కాంగ్రెస్ పార్టీని వీడలేదు. పక్క చూపులు చూడలేదు. కాంగ్రెస్‌లోనే కంటిన్యూ అవుతూ రాజకీయాలు చేశారు. అంతెందుకు మొన్నటి టీపీపీసీ చీఫ్ కోసం కూడా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హస్తినలో బీభత్సమైన లాబీయింగ్ జరిపారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నం చేసినా వర్కవుట్ కాలేదు. దీంతో ఎంపీ కోమటిరెడ్డి కామయ్యారు. కానీ తమ్ముడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి మాత్రం రూటు మార్చారు. భిన్న రాజకీయ సమీకణాలతో ముందుకు సాగుతున్నారు.
నమ్ముకున్న పార్టీలో ఎలివేషన్ లేదు పార్టీ పగ్గాలు దక్కుతాయన్న ఆశా లేదు అందివచ్చిన అవకాశాలని వినియోగించడంలో పార్టీలో ఇతర నేతల సహకారం అసలే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యర్ధుల నుంచి అనూహ్యంగా వస్తున్న బంపర్ ఆఫర్లు సయోధ్య ఈ ఆలోచనలే కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరైన రాజగోపాల్‌రెడ్డి రూటు మారాలన్న నిర్ణయానికి కారణమయ్యాయన్న పొలిటికల్ టాక్స్ గాంధీభవన్ సాక్షిగా వినిపిస్తున్నాయిప్పుడు. అప్పట్లో తెలంగాణలో భవిష్యత్ అంతా బీజేపీతోనే అంటూ కమలం పార్టీలో చేరుతారా అన్నంతగా సీన్ క్రియేట్ చేసిన రాజగోపాల్‌రెడ్డి మొన్నీ మధ్యే రాజకీయ పార్టీగా పురుడు పోసుకున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు మద్దతివ్వడం సంచలనం క్రియేట్ చేసిందన్న ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో పలు సమస్యలపై పోరాటం చేస్తున్న షర్మిల, నిరుద్యోగ యువత కోసం, నోటిఫికేషన్ల కోసం ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మునుగోడులో షర్మిల దీక్ష చేపట్టారు. దీనికి జిల్లా నలుమూలల నుంచి వైఎస్ అభిమానులు, షర్మిల మద్దతుదారులు తరలివచ్చారు. మునుగోడుకు ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్‌రెడ్డి ఆ దీక్షలో ఉన్న షర్మిలకు వీడియో కాల్ చేసి మాట్లాడటం రాజకీయంగా ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది.
తాము అమితంగా అభిమానించే వైఎస్సార్ కూతురిగా తన నియోజవర్గంలో దీక్ష చేస్తున్న షర్మిలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు రాజగోపాల్. అంతేకాదు ఇన్నాళ్లూ అస్సలు కాంగ్రెస్ పార్టీ గురించి ఏమాత్రం పట్టించుకోని ఆయన సడన్‌గా షర్మిల దీక్షకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు పలుకుతుందంటూ ఫోన్‌లో మాట్లాడి సంచలనం రేపారు. రాజన్న బిడ్డగా షర్మిలకు మునుగోడులో సాదర స్వాగతమంటూ తమ చివరి శ్వాస ఉన్నంత వరకు వైఎస్సార్ తమ గుండెలో ఉంటారంటూ ఆమె మాట్లాడటంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
అప్పట్లో వైఎస్సార్‌తో ఉన్న అనుబంధంతోనే రాజగోపాల్‌రెడ్డి షర్మిలకు వ్యూహాత్మకంగా మద్దతు ఇచ్చి ఉంటారని చర్చ జరుగుతోంది. జిల్లాలో ఎక్కడ కూడా షర్మిల దీక్షపై ఇతర పార్టీ నేతలు కానీ, కాంగ్రెస్ నేతలు కానీ అంతగా స్పందించలేదు. మద్దతు కూడా పలకలేదు. కానీ తన నియోజకవర్గంలో షర్మిల చేపట్టిన దీక్షకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మద్దతు ఇవ్వడం, అదీగాకుండా కాంగ్రెస్ పార్టీయే మద్దతుగా ఉంటుందని చెప్పడం ఏంటన్న చర్చ జరుగుతోంది. ఏదీ ఏమైనా అప్పట్లో బీజేపీని పొగిడిన రాజగోపాల్‌రెడ్డి, అనూహ్యంగా షర్మిల దీక్షకు మద్దతివ్వడం అదే సమయంలో టీఆర్ఎస్‌ను విమర్శించడంపై ఆయన మనస్తత్వం ఏంటోనని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొన్నటి దాకా కాంగ్రెస్‌ను విమర్శించకుండా, కమలం పార్టీని పొగిడిన రాజగోపాల్ స్వరం మార్చి తెలంగాణను ఇచ్చింది సోనియా తెచ్చింది కాంగ్రెస్ క్యాడర్ అంటూ మాట్లాడటంపై భిన్నరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ముందు ముందు ఈ రాజగోపాలుడు ఏ పల్లెలో ఉంటారో కాలమే సమాధానం చెప్పాలి.