Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా రాగల 48 గంటల్లో భారీ వర్షలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడనం ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో రాగల రెండ్రోజుల్లో విస్తారంగా వర్షాలు పడతాయని, పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అటు, నైరుతి రుతుపవనాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 6 ఉమ్మడి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందని వివరించింది. ఇది రాగల రెండు, మూడు రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశలో ఝార్ఖండ్, ఒడిశా, నార్త్ చత్తీస్ గఢ్ ప్రాంతాల మీదుగా పయనిస్తుందని తెలిపింది.