Puvvada Ajay expresses condolence over death of TSRTC employees: టి.ఎస్.ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు కోవిడ్19 బారిన పడి చనిపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోందంటూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. సంస్థ తరఫున బాధితులకు తాను అవసరమైన సహాయ చర్యలు చేపట్టం జరుగుతోందని, కరోనా లక్షణాలు ఉన్న వారికి కిట్లు అందజేయడానికి ఇప్పటికే తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఉద్యోగులు గాని అధికారులు గాని విధి నిర్వహణలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమన్నారు.
మాస్కులు ధరించడం, బౌతిక దూరం పాటించడం, శానిటైజర్ వాడటం, అవనరమైన మేరకు సబ్బుతో చేతులను శుభ్రపరుచుకోవడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం వంటి చర్యల్ని నిరంతరం పాటించినట్లయితే కరోనా బారి నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. బాధితులు ఎవరూ అధైర్య పడవద్దని, చికిత్స అందించడానికి గాంధీ ఆసుపత్రి, గచ్చిబౌలిలోని టిమ్స్ హాస్పిటల్ లో మెరుగైన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. బాధితులకు ధైర్యమే ముఖ్యమని, దిగులు చెందకుండా ప్రాధమిక దశలో తగు విధంగా జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. కరోనా బాధితులకు సంస్థ నిబంధనల ప్రకారం తగిన సహాయ, సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. చనిపోయిన బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ సంస్థ తరఫున అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి భరోసా కల్పించారు.