పెరిగిన గ్యాస్ ధరలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
* మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు
LPG Cylinder Gas: పెరిగిన సిలిండర్ల ధరలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రోడ్లపై బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు. సిలిండర్ల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సికింద్రాబాద్‌లోని గాంధీ విగ్రహం దగ్గర మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు బీఆర్ఎస్ నేతలు. పేదలు, మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా పాలన చేస్తున్న బీజేపీకి అధికారంలో ఉండే అర్హత లేదన్నారు మంత్రి తలసాని. మరో ఏడాది మాత్రమే బీజేపీ అధికారంలో ఉంటుందన్న తలసాని.. ప్రజలు బుద్ధి చెప్పే రోజు ఆసన్నమైందన్నారు.
హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం ముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గ్యాస్ సిలిండర్ , కట్టెల మోపులతో వినూత్నంగా తమ నిరసన తెలియజేశారు. మహిళా దినోత్సవం ముందు కేంద్రం పెంచిన గ్యాస్ ధరలను గిఫ్ట్ గా ఇచ్చిందని.. వచ్చే ఎన్నికల్లో మహిళలు మోదీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్.
ఇక కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్యే వివేకానంద ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు బీఆర్ఎస్ నేతలు. రోడ్డుపై బైఠాయించి ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేకానంద.. బీజేపీ ప్రభుత్వానికి ఎన్నికలపుడే కామన్ మ్యాన్ గుర్తుకువస్తాడన్నారు.