Telangana: పాఠశాలల్లో పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రభుత్వం తీసుకోబోయే యాక్షన్ ప్లాన్ ఏంటి?
Telangana: తెలంగాణలో కరోనా టెన్షన్ మళ్లీ మొదలైంది. రాష్ట్రంలోని స్కూళ్లు, హాస్టళ్లు, గురుకులాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.
Telangana: తెలంగాణలో కరోనా టెన్షన్ మళ్లీ మొదలైంది. రాష్ట్రంలోని స్కూళ్లు, హాస్టళ్లు, గురుకులాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వరుసగా విద్యార్థులు కోవిడ్ బారిన పడుతుండడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. కరోనా భయంతో అటు విద్యార్థుల హజరు కూడా 40శాతానికి దాటడం లేదు. దీంతో ప్రభుత్వం తీసుకోబోయే యాక్షన్ ప్లాన్ ఏంటి అన్న దానిపై ఉత్కంఠ పెరుగుతొంది.
ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణలో 9, 10వ తరగతి క్లాసులు తిరిగి ప్రారంభమయ్యాయి. అదే నెల చివరిలో 6, 7, 8 తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. మొదట్లో పాఠశాలలకు విద్యార్థులు బాగానే హాజరయినప్పటికీ ప్రస్తుతం కరోనా కేసులు పెరగడంతో విద్యార్తుల హాజరు గణనీయంగా పడిపోయింది. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూళ్ల పరిస్థితి అయితే మరీ దారుణం. మొత్తం 475 కేజీబీవీలు ఉండగా, 49 వేల 915 మంది 6 నుంచి 8 క్లాస్ వరకు చదువుతున్నారు. సొసైటీ గురుకులాల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. మొత్తం 37 గురుకులాల్లో 8 వేల 216 మందికి గాను 33 శాతం మాత్రమే అటెండ్ అవుతున్నారు. 9,10 క్లాసులలో మాత్రం 70 శాతం వరకు అటెండెన్స్ ఉంటోంది.
మరోవైపు స్కూల్స్, హాస్టళ్లలో ఏ ఒక్కరికి కరోనా పాజిటివ్ వచ్చినా మొత్తం విద్యార్థులు, స్టాఫ్ ఐసోలేషన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ పాఠశాలలను మూసివేసి, విద్యార్థులకు సెలవులు ప్రకటించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కొన్ని తరగతులను బంద్ చేసి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 6 నుంచి 8 వరకూ క్లాసులు మాత్రమే బంద్ చేయాలా? లేక 10 వరకూనా అన్న అంశంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. గత వారమే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి స్టూడెంట్స్ అడ్మిషన్ ఎన్‌రోల్‌మెంట్ వివరాలను సీఎంవో అధికారులు సేకరించారు.
పదోతరగతి విద్యార్థులకు బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి క్లాసులు కంటిన్యూ చేసే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. అయితే ఇంటర్, డిగ్రీ ఆపై తరగతుల క్లాసుల విషయంలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది త్వరలోనే తేలనుంది.