కరోనా జీవితం : మాస్టారు నుంచి మెకానిక్ స్థాయికి అసిస్టెంట్ ప్రొఫెసర్..
కష్టపడి చదివాడు కలలు నిజం చేసుకునేందుకు చిన్నపాటి ఉద్యోగం నుంచి ప్రారంభించి ఎదిగాడు . అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికి చేరాడు. ప్రైవేట్ కాలేజ్‌లో ఉద్యోగమే అయినా ఇక లైఫ్ సెటిల్ అనుకున్నాడు. కానీ అంతలోనే అనుకోని విపత్తు అతని జీవితాన్ని తలకిందులు చేసింది. పాఠాలు చెప్పాల్సిన అతన్ని పాణలు పట్టుకునే స్థాయికి దిగజార్చింది. ఈ దీనగాథ కరోనా కల్లోలంతో కుదేలైన జీవితాలకు నిదర్శనంగా నిలుస్తోంది.
ఇంజినీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ.. దశాబ్ద కాలం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం. ఇలా ఖమ్మం జిల్లా మధిరకు చెందిన రవీందర్ జీవితం ఎంతో ప్రశాంతంగా సాగుతోంది. కానీ ఆ జీవితాన్ని కరోనా తలకిందులు చేసింది. అతని కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో సొంతూరుకు చేరుకున్న ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ కుటుంబ పోషణ కోసం బైక్ మెకానిక్ గా మారాడు.
పదేళ్ల క్రితం ఎంటెక్ పూర్తి చేసిన వంకొడోతు రవీందర్ కుటుంబం చిన్ననాటి నుంచి మధిరలోనే నివాసం ఉంటుంది. పేద కుటుంబమే అయినా కూలీ చేసి చదివించిన తన తండ్రి సహకారంతో రవీందర్ ఉన్నత చదువులు చదివారు. ఎంటెక్ పూర్తయ్యాక ఖమ్మం, కొత్తగూడెంలోని కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజ్‌లో మెకానికల్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధుల్లో చేరారు.
రవీందర్ భార్య కూడా ఎంటెక్ పూర్తి చేసినా ఇంటి బాధ్యతలు చూసుకునేవారు. వీరికి ఇద్దరు సంతానం. ఇలా దాదాపు లైఫ్ సెటిల్‌మెంట్ అనుకున్న తరుణంలో లాక్ డౌన్ ఎఫెక్ట్ తో కాలేజీ మూతపడింది. దీంతో జీతం రాక కుటుంబ పోషణ భారంగా మారింది. ఏం చేయాలో అర్థం కాక వేరే పనులు చేసే దారి లేక సొంతూరు బాట పట్టారు రవీందర్. చదివింది మెకానికల్ ఇంజనీర్ కావడంతో పలు షోరూమ్‌లు, మెకానిక్ షాపులకు ఉద్యోగం కోసం తిరిగాడు. అయినా ఎక్కడా పని దొరకకపోవడంతో, తన దగ్గర విద్య నేర్చుకుని సొంతంగా మెకానిక్ షాప్ పెట్టిన హరినాయక్ దగ్గరే కలిసి పనిచేస్తున్నారు.
ఇక రవీందర్ తన కష్టాలు చెప్పటంతో గురువుకు ఏదైనా చేయాలన్న తపనతో అతనికి అండగా నిలిచాడు హరినాయక్. ఇద్దరం కలిసి పని చేసి ఆదాయంలో షేర్ తీసుకుందామని చెప్పాడు. మళ్లీ ఉద్యోగంలో చేరే వరకు తన దగ్గరే ఉండమనటంతో ఆ ఆదాయంతోనే కుటుంబాన్ని వెల్లతీసుకుంటున్నాడు రవీందర్.
లాక్ డౌన్ ఓ గురువును కూరగాయలు అమ్మే స్థితికి తీసుకురాగా మరో వ్యక్తి మెకానిక్‌గా మార్చేసింది. ఇలాంటి వారు ఎంతోమంది ప్రైవేట్ ఉద్యోగులు నిరుద్యోగులుగా మారి కష్టాలు పడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం కొవిడ్ కష్టాల్లో ఉన్న ప్రైవేట్ ఉద్యోగులను ఆదుకోవాలని కోరుతున్నారు.