Prof Jayashankar Birth Anniversary : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నేడు. తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆయన అవిశ్రాంతంగా కృషి చేశారు. తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు ఆయన. తెలంగాణ ఉద్యమం అనగానే ముందుగా స్ఫురించేది జయశంకర్ పేరు.
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆగష్టు 6, 1934న వరంగల్ జిల్లా, ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామశివారు అక్కంపేటలో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్- ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటులో కె.చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని తరుచుగా చెప్పే జయశంకర్ 2011 జూన్ 21న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు.
ప్రొఫెసర్ జయశంకర్ బాల్యం, విద్యాభ్యాసం, ఉద్యోగం
1934, ఆగస్టు 6 న వరంగల్ జిల్లా, ఆత్మకూరు మండలం అక్కంపేటలో విశ్వబ్రాహ్మణ కులంలో ఆయన మహాలక్ష్మి, లక్ష్మీకాంత్‌రావు దంపతులకు జన్మించారు. జయశంకర్ తల్లిదండ్రులకు రెండో సంతానం. ఆయనకు ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. కాగా ఆయన జీవితాన్ని పూర్తిగా తెలంగాణ ఉద్యమానికే అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోయాడు.
బెనారస్, అలీగఢ్ విశ్వవిద్యాలయాలనుంచి ఆర్థికశాస్త్రంలో పట్టా అందుకున్న జయశంకర్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశాడు. 1975 నుంచి 1979 వరకు వరంగల్ లోని సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. 1979 నుంచి 1981 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం రిజస్ట్రార్‌గా, 1982 నుంచి 1991 వరకు సీఫెల్ రిజిస్ట్రార్‌గా, 1991 నుంచి 1994 వరకు అదే యూనివర్శిటీకి ఉపకులపతిగా పనిచేశాడు.
అధ్యాపకుడిగా
అధ్యాపకుడిగా ఆయన ఎంతో మందికి మార్గనిర్దేశం చేశారు. వృత్తిపట్ల నిబద్ధతను, తెలంగాణ ఉద్యమం పట్ల చిత్తశుద్ధిని వారిలో నూరిపోశారు. ఎమ్జన్సీ కాలంలో ఆయన సీకేఎం కళాశాలకు ప్రిన్సిపల్‌గా పనిచేశారు. సీకేఎం కళాశాల అంటేనే జిల్లాలో విప్లవ విద్యార్థి ఉద్యమానికి కేంద్రంగా అప్పట్లో పేరుండేంది. విప్లవకవి వరవరరావు లాంటి వాళ్లు ఆ కాలేజీలో అధ్యాపకులుగా వ్యవహరించారు. ఎమ్జన్సీ గడ్డురోజుల్లో ఆయన కళాశాలను నడిపి ఎంతో మంది విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని ఆయన నిర్బంధం నుంచి కాపాడారు. ఆయన అధ్యాపకుడిగా హన్మకొండలోని మల్టీపర్సస్ స్కూల్లో మొదట తెలుగు బోధించారు. ఒక అధ్యాపకున్ని విద్యార్థులు గుర్తుపెట్టుకోవడం సర్వసాధారణమే కానీ ఒక అధ్యాపకుడే తన విద్యార్థుల్ని గుర్తుపెట్టుకొని పేరుపెట్టి పిలవడం ఒక్క జయశంకర్ కే సాధ్యం అంటూ ఆయనకు తనకు 35 ఏళ్ల అనుబంధం ఉందని, ప్రముఖ సాహీతివేత్త రామశాస్త్రి కన్నీళ్లపర్యంతమయ్యారు. జయశంకర్ విద్యార్థుల్లో అనేక మంది దేశవిదేశాల్లో ప్రస్తుతం ప్రముఖ స్థానంలో ఉన్నారు. వీరిలో కేయూ మాజీ ప్రొఫెసర్ ఎన్. లింగమూర్తి, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ప్రొఫెసర్ కే. సీతారామావు తదితరులు అనేక మందికి ఆదర్శ గురువు జయశంకర్.
తెలంగాణా ఉద్యమంలో
1969 తెలంగాణా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1952 లో జయశంకర్ నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్, ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నాడు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగా ఆయన 1954 లో ఫజల్ అలీ కమిషన్‌కు నివేదిక ఇచ్చాడు. కే.సీ.ఆర్‌కు సలహాదారుగా, మార్గదర్శిగా తోడ్పాటు అందించాడు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన పుస్తకాలు రాశాడు. తెలంగాణలోనే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశాడు. జయశంకర్ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశాడు.
విదేశాల్లో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీదాకా, ఢిల్లీ నుంచి అమెరికా దాకా వ్యాప్తిచేయడంలో ఆయన పాత్ర మరవలేనిది. విద్యార్థి దశ నుంచే తెలం'గానం'ఆచార్య జయశంకర్ విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరుగుతోన్న అన్యాయాల పట్ల, అసమానతల పట్ల తీవ్రంగా పోరాటం చేశారు. 1952 నాన్ ముల్కీ ఉద్యమంలోకి ఉరికి ఆనాటి నుంచి సమరశీల పాత్రను పోషించారు. ఎవరూ మాట్లాడటానికి సాహసించని కాలంలోనే 1954 విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీశాలి జయశంకర్. విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్సార్సీ కమిషన్ ముందు హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించిన మేధావి కొత్తపల్లి జయశంకర్. అధ్యాపకునిగా, పరిశోధకుడిగా ఆయన ఏం చేసినా తెలంగాణ కోణంలోనే నిత్యం ఆలోచించి ఆచరించే మహనీయుడు. తెలంగాణ డిమాండ్‌ను 1969 నుంచి సునిశితంగా అధ్యయనం చేస్తూ, విశ్లేషిస్తూ ప్రతీరోజూ రచనలు చేసాడు.
తెలంగాణలోని ప్రతీపల్లె ఆయన మాటతో పోరాట గుత్ప అందుకున్నది. ఆయన తిరగని ప్రాంతం లేదు. తెలంగాణ విషయంలో ఆయన చెప్పని సత్యం లేదు. జాతీయ, అంతర్జాతీయ వేదికలమీద, విశ్వవిద్యాలయాల పరిశోధనా సంస్థల సభలో, సమావేశాల్లో తెలంగాణ రణన్నినాదాన్ని వినింపించిన పోరాట శీలి.
జయశంకర్ ఆలోచనలు
'ఉస్మానియాను తలుచుకుంటే తెలంగాణ వాడినైనందుకు గర్వంతో ఛాతి ఉబ్బుతుంది. ఎన్నెన్ని పోరాటాలకు, ఆరాటాలకు అది వేదికైంది చెప్పు.. అందరికీ ఉస్మానియా యూనివర్శిటీ అంటే చెట్లు కనిపిస్తయి.. కానీ మొన్నటికి మొన్న తెలంగాణ కోసం అమరులైన అనేక మంది విద్యార్థులు ఆ చెట్ల సాక్షిగా నాకు కళ్లముందే కదుల్తు కనిపిస్తరు. దు:ఖమొస్తది.. అయితే నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది. వాళ్లకు మరణం లేదు… అదే ఉస్మానియాలో డిసెంబర్ 9 ప్రకటన తర్వాత పిల్లలు జరుపుకున్న సంబరం నా జీవితంలో మర్చిపోలేని గొప్ప జ్నాపకం. కానీ వారి భవిష్యత్ కలలతో ఆడుకున్నది ఎవరు? వారి ఆశలతో ఆడుకుని… వారి శవాలపై ప్రమాణం చేసిన రాజకీయనాయకులకు వాళ్ల ఉసురు తగలకుండా పోతుందా'
మరణం..
రెండేళ్లపాటు గొంతు క్యాన్సర్‌తో బాధపడిన ప్రొఫెసర్ జయశంకర్ 2011 జూన్ 21 మంగళవారం ఉదయం 11.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.