Corporate Hospitals: అసలే ఇది కరోనా కాలం.. దీనికి తోడు పడకల కొరత వెంటాడుతోంది. అయితే నిజంగా కరోనా వస్తే ఆస్పత్రుల్లో పడకలు దొరకవా..? బెడ్స్ ఉన్నా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా..? ఇంతకి ఏ ఆసుపత్రిలో ఎన్ని బెడ్లున్నాయి..? ఏయే దావాఖానాలు కరోనా వ్యాపారం చేస్తున్నాయి..?
రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం, ప్రైవేట్ ఆస్పత్రులు వ్యవహరిస్తున్న తీరు సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా ట్రీట్మెంట్ కోసం పడకలు లేవంటూ చాలా ఆసుపత్రులు బాధితులను చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నాయి. దీంతో అనేకమంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పడకల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్, ప్రభుత్వ ఆసుపత్రులు కరోనా వైద్యసేవలు అందిస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. వాటన్నింటిలో సాధారణ పడకలు, ఆక్సిజన్ పడకలు, ఐసీయూ పడకలు అన్నీ కలిపి 12,943 వరకు ఉన్నాయని వెల్లడించింది. అందులో ప్రైవేట్, కార్పొరేట్, ఇతర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 4,497, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 8,446 పడకలు కరోనా వైద్యం కోసం కేటాయించినట్లు అధికారులు వివరించారు.
ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్న 4,497 పడకలకుగాను 3,032 నిండిపోగా, ఇంకా 1,465 పడకలు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న 8,446 కరోనా పడకల్లో 2,242 నిండిపోగా, ఇంకా 6,204 పడకలు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 7,669 పడకలు అంటే 59.25శాతం ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇన్ని బెడ్స్ ఖాళీగా ఉన్నా రోగులకు బెడ్స్ ఇవ్వకపోవడంతో కొందరు మరణించిన ఉదంతాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పడకలు అందుబాటులో లేవంటూ ప్రేవేట్ ఆసుపత్రులు జనాలను ఇబ్బంది పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో పడకలు లేవని చెప్పడానికి సిబ్బంది లేకపోవడమేనని పలువురు ఆరోపిస్తున్నారు. యాజమాన్యం తీరుతో విసిగిపోయిన అనేక మంది నర్సులు, ఇతర సిబ్బంది రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రోగుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేసి సిబ్బందికి తక్కువ జీతాలు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఖాళీ గా ఉన్న బెడ్స్ వివరాలు ప్రభుత్వం అందించటంతో ప్రైవేట్ ఆసుపత్రుల అసలు బండారం బయటపడింది.