తెలంగాణలో కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమం.. జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ
Telangana: జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ
Telangana: తెలంగాణలో అభయహస్తం-ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతోంది. మొత్తం 16 వేల 395 ప్రదేశాల్లో ప్రజాపాలన సదస్సులు ఏర్పాటు చేశారు. 12 వేల 769 గ్రామ పంచాయతీలు, 3 వేల 626 గ్రామ వార్డుల్లో ప్రజాపాలన సదస్సులు జరుగుతున్నాయి. గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల నుంచి స్వీకరించనున్నారు అధికారులు. జనవరి 6 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ 4 పేజీల దరఖాస్తులో కాంగ్రెస్ గ్యారెంటీల వివరాలు ఉన్నాయి. లబ్ధిదారులు.. దరఖాస్తుతోపాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్, రేషన్ కార్డులను జత చేయాలని అధికారులు సూచించారు.
మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాల కోసం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. దరఖాస్తుల స్వీకరణ అనంతరం రసీదు ఇవ్వనున్నారు అధికారులు. అయితే.. ఈ ప్రజాపాలన కోసం 3 వేల 714 అధికార బృందాలను ఏర్పాటు చేశారు. మహిళలు, పురుషుల కోసం వేరు వేరు క్యూ లైన్లు ఏర్పాటు చేయగా.. ప్రతి 100 దరఖాస్తు దారులకు ఒక కౌంటర్‌ను సిద్ధం చేశారు. ప్రజాపాలన పర్యవేక్షణకు ప్రతి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అధికారులు.