Telangana Liberation Day: సెప్టెంబర్ 17ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు

* పోటీ పడి మరీ కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు * నిర్మల్‌లోని వెయ్యి ఉరులమర్రి వద్ద బీజేపీ భారీ సభ

Update: 2021-09-16 06:56 GMT

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్ (ట్విట్టర్ ఫోటో) 

Telangana Liberation Day: తెలంగాణలో సెప్టెంబర్‌ 17 ప్రాధాన్యత మరోసారి సంతరించుకుంది. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్ మళ్లీ తెర మీదకు వచ్చింది. అంతేకాదు పోటీ పడి మరీ కార్యక్రమాలు నిర్వహించేందుకు రెడీ అయ్యాయి. విమోచన దినోత్సవ సెంటుమెంట్‌తోనే ప్రజలను తమవైపు తిప్పుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌ తెలంగాణ విమోచణ దినోత్సవ అంశాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి తహతహలాడుతున్నాయి.

కొన్నేళ్లుగా తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ రేపు నిర్మల్‌లో సభ నిర్వహిస్తుండగా, కాంగ్రెస్ పార్టీ సైతం అదే రోజు దళిత గిరిజన ముగింపు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రం రాజకీయ సభలతో హోరెత్తనుంది. ఓ వైపు రెండు విపక్ష పార్టీలు తమ కార్యక్రమాలతో సిద్దమవుతుండగా అధికార టీఆర్ఎస్ పార్టీ సైతం కౌంటర్ అటాక్‌కు రెడీ అవుతుంది.

బీజేపీ నిర్మల్‌‌లో నిర్వహించే సభ‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజ‌రు కానున్నారు. ఇక ఈ ఉద్యమంలో వెయ్యి మందిని ఉరి తీసిన వెయ్యి ఉరులమర్రి దగ్గర జరిగే ఈ సభను భారీగా సక్సెస్ చేయడానికి కాషాయ పార్టీ కసరత్తు చేసింది. కాంగ్రెస్ సైతం సెప్టెంబర్ 17ను టార్గెట్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. సీఎం సొంత నియోజకవర్గంలో రాజ్యసభ ఫ్లోర్ లీడర్ మళ్లికార్జున ఖర్గేతో దళిత గిరిజన దండోర ముంగింపు సభ పేరిట భారీ బహీరంగ సభ నిర్వహిస్తోంది.

ఇక సెప్టెంబర్ 17న ప్రతిపక్షాలు భారీ సభలతో ప్రజల్లోకి వెళుతుంటే సీఎం కేసీఆర్ దైవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ విమోచన దినోత్సవం రోజునే సీఎం కేసీఆర్ యాదాద్రి పనుల పరిశీలనకు వెళ్లనున్నారు. ప్రభుత్వంపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడానికి విపక్షాలు సెప్టెంబర్ 17ను ఎంచుకుంటే తాము చేసిన అభివృద్దిని చెప్పుకుంటే తప్పేంటని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ప్రజలు అభివృద్ది వైపే ఉంటారని, అబద్దాల వైపు ఉండరని గులాభి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News