Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో దూకుడు పెంచిన పోలీసులు

Phone Tapping Case: టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌ను కస్టడీకి కోరుతూ పిటిషన్‌

Update: 2024-04-02 04:05 GMT

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో దూకుడు పెంచిన పోలీసులు

Phone Tapping Case:  ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీసు అధికారులను అదుపులోకి తీసుకుని.. వారి నుంచి కీలక విషయాలు రాబట్టారు. నిన్న టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు కూడా బయటపెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో 10 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. కోర్టు కస్టడీకి అనుమతిస్తే రాధాకిషన్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టాలని భావిస్తు్న్నారు.

మరోవైపు ట్యాపింగ్ కేసులో పోలీసులకు వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. గత ప్రభుత్వ పెద్దల పాత్రపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ నేత కేకే మహేందర్ రెడ్డి హైదరాబాద్ సీపీని కలిసి ఫిర్యాదు చేశారు. సిరిసిల్ల కేంద్రంగా ట్యాపింగ్ జరిగిందని.. గత ప్రభుత్వం స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ట్యాపింగ్‌కు పాల్పడిందని ఆరోపించారు కేకే మహేందర్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలపై గత ప్రభుత్వం ఫోన్ టాపింగ్ లకు పాల్పడిందని.. ట్యాపింగ్ చేయాలని ఆదేశాలు ఇచ్చిన వారిని వదిలిపెట్టకూడదని సీపీని కోరారు. టెలిఫోన్ యాక్ట్ ప్రకారం బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు.

ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో తీగ లాగే కొద్దీ డొంక కదులుతూనే ఉంది. పోలీసు ఉన్నతాధికారులతో పాటు రాజకీయ నేతల ప్రమేయం, ట్యాపింగ్ జరిగిన తీరు ఇలా.. విచారణలో ఒక్కొక్క విషయం బయటపడుతూ ఉంది. తాజాగా రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో మరో కొత్త పేరు కూడా చేర్చడంతో ఆయన్ను కూడా విచారించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నేడో రేపో వేణుగోపాల్‌ రావును అరెస్ట్‌ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో A4 గా ఉన్న రాధాకిషన్‌రావు.. దుబ్బాక ఉపఎన్నికలో రఘునందన్‌రావు బంధువుల నుంచి కోటి రూపాయలు నగదు సీజ్ చేశామని ఒప్పుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. అలాగే.. మునుగోడు ఉపఎన్నికలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి చెందిన మూడున్నర కోట్లు సీజ్ చేసినట్టు రాధాకిషన్‌ అంగీకరించారు. ప్రభాకర్‌రావు ఆదేశాలతోనే భవ్య సిమెంట్ యజమాని ఆనంద్‌ ప్రసాద్‌ నుంచి 70 లక్షలు సీజ్ చేసినట్టు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో చేర్చారు. నల్గొండ నుంచి ప్రణీత్‌రావు, రాచకొండ నుంచి భుజంగరావు, సైబరాబాద్‌ నుంచి వేణుగోపాల్‌రావు, హైదరాబాద్‌ సిటీకి తిరుపతన్నను నియమించుకున్నట్టు రాధాకిషన్‌రావు పోలీసులకు తెలిపారు. 

Tags:    

Similar News