Perala Shekhar Rao: కమలంలో బాంబు పేలుస్తున్న పేరాల

Perala Shekhar Rao: తెలంగాణలో కమలనాథులు తమ పంథా మార్చుకున్నారా?

Update: 2021-10-14 08:05 GMT

Perala Shekhar Rao: కమలంలో బాంబు పేలుస్తున్న పేరాల

Perala Shekhar Rao: తెలంగాణలో కమలనాథులు తమ పంథా మార్చుకున్నారా? సిద్ధాంతానికి పెద్దపీట వేసే కమలం పార్టీ, ఆ ఆనవాయితీని పక్కన పెడుతోందా? నమ్ముకున్న సిద్ధాంతం కోసం, జీవితాన్ని త్యాగం చేసిన వారిని కూడా పక్కనబెట్టడం దేనికి సంకేతం? మూకుమ్మడిగా పాత వారిని పొమ్మనలేక పొగపెట్టడానికి బలమైన కారణం ఏమైనా ఉందా? అసలు తెలంగాణ కమలం పార్టీలో జరుగుతున్న కలకలం ఏంటి? రేగుతున్న కలవరం ఏంటి?

తెలంగాణ బీజేపీలో అంతర్గతంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారి రచ్చకెక్కుతోంది. ప్రగతిభవన్ అంశంతో పార్టీలో ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. గత మూడు నెలల కింద ఈ ఇష్యూని పార్టీ హైకమాండ్‌ సీరియస్‌గా తీసుకొని విచారణకు ఆదేశించడంతో అది మరింత ముదిరింది. ఆ విచారణలో వివక్ష చూపించారని పార్టీ సీనియర్ నేత పేరాల శేఖర్‌రావు భగ్గుమన్నారట. పార్టీలో ముఖ్య నేతల వద్ద కూడా ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారట. అయినా ఆ పార్టీ పెద్దలు పట్టీ పట్టనట్టుగా వ్యవహరించడంతో శేఖర్‌జీ ఏకంగా ఢిల్లీ పార్టీకి, సంఘ్‌ పరివార్‌కు బహిరంగ లేఖ రాశారని చర్చ జరుగుతోంది.

సిద్ధాంతాన్ని నమ్ముకొని, పార్టీకి తన జీవితాన్ని త్యాగం చేసి నాయకుడిని, అవమానించేలా పార్టీలోని కొందరు నేతలు వ్యవహరిస్తున్నారన్న ప్రచారం మధ్య కమలం కమిలిపోతోందట. పార్టీకి నష్టం జరిగితే, ప్రగతిభవన్ ఇష్యూలో సంబంధం ఉన్న అందరినీ బాధ్యులని చేయాలని గానీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి క్లీన్‌చిట్‌ ఇచ్చిన తనను ఎందుకు దోషిగా నిలబెట్టారంటూ పేరాల ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీకి, సంఘ్ పరివార్‌కి బద్దుడనే కానీ, తన రాజకీయ స్వార్థం కోసం కాదని చెప్పడానికే పేరాల లేఖను విడుదల చేసినట్లు చర్చ సాగుతోంది.

తాజాగా జాతీయ కార్యవర్గ సభ్యులను ప్రకటిచింది బీజేపీ హైకమాండ్‌. ఆ ప్రకటన కూడా పార్టీలో కొత్త వివాదం రేపుతున్నట్టు కనిపిస్తోంది. కొత్తగా ప్రకటించిన కార్యవర్గ సభ్యుల్లో అందరు కొత్త వారికే స్థానం ఇవ్వడం పార్టీలో దుమారానికి కారణం అవుతోందట. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇచ్చి పార్టీనే నమ్ముకొని పనిచేస్తున్న వారిని పూర్తిగా పక్కన బెట్టడం సీనియర్లకు ఆగ్రహం తెప్పించిందట. గతంలో జాతీయ కార్యవర్గ సభ్యులను ఎప్పుడు ప్రకటించినా పాత, కొత్త కలయితో ఉండేదని, అలాంటిది ఈసారి దానికి భిన్నంగా పాతవారిని మొత్తానికి మొత్తం పక్కనేబెట్టడాన్ని సీనియర్లు జీర్ణించుకోవడం లేదట. పేరాల శేఖర్‌జీ, ఇంద్రసేనారెడ్డిలాంటి వారిలో ఎవరో ఒక్కరికి జాతీయ కార్యవర్గ సభ్యత్వం ఇచ్చి మిగతా కొత్త వారికి అవకాశం ఇచ్చి ఉంటే పార్టీలో ఈ రచ్చ ఉండేది కాదని పార్టీలో కొందరు చర్చించుకుంటున్నారు. ఎప్పుడైన సిద్దాంతానికే పెద్దపీట వేసే పార్టీ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రియారిటీ ఇవ్వడం కొందరికి మింగుడుపడని అంశంగా మారుతోందట.

ఏమైనా కమలం పార్టీ లైన్‌ ఇప్పుడు మారుతున్నట్టే కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సిద్దాంతానికి కట్టుబడి, పుల్‌టైమ్‌గా పార్టీకే అంకితమైన వారికి ప్రాధాన్యమిచ్చే బీజేపీ కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారితోనే ప్రజల్లోకి వెళ్తే బలపడుతామన్న నమ్మకంతోనే బీజేపీ ఇలా వ్యవహరిస్తోందన్న టాక్‌ వినిపిస్తోంది. ఒకే ఒక్క స్ట్రోక్‌లో విజయశాంతి, ఈటల, గరికపాటి రామ్మోహన్‌రావు, వివేక్, జితేందర్‌రెడ్డిలకు జాతీయ స్థాయి పదవులు వచ్చాయంటే ఇక భవిష్యత్తు కొత్త వారితోనే అన్న ధోరణిని కమలనాథులు కనబరిచారని చెప్పుకుంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి ఇది శుభవార్తే అయినా సొంత పార్టీనే నమ్ముకుని కొన్నేళ్ల నుంచి పని చేస్తున్న వారికి మాత్రం కచ్చితంగా చేదు వార్తే అంటున్నారు విశ్లేషకులు.

అదీగాక, ప్రగతిభవన్‌ ఇష్యూలో పార్టీగాని, సంఘ్ ప‌రివార్ గానీ, క‌నీసం తన వర్షన్‌ తీసుకోలేదంటున్న పేరాల పార్టీ కోసం క‌ష్టప‌డ్డ వారిని కాద‌ని ఇత‌ర పార్టీల‌కు ద్రోహం చేసి బీజేపీలో చేరిన నేతల కోసం తనను బాధ్యులను చేస్తున్నారని భగ్గుమంటున్నారు. పార్టీనే న‌మ్ముకొని ప‌నిచేస్తున్న త‌న‌కు, బండి సంజ‌య్‌కి కొందరు గ్యాప్‌ పెంచారని పేరాల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేత‌ల మ‌ధ్య ఇప్పుడు సత్సంబంధాలు లేవని, భావ వ్యక్తీకరణ చేసే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందని ఆయన మండిపడుతున్నారు. ఈ పంచాయితీ ఏకంగా ఢిల్లికి చేరే అవకాశం ఉండడంతో వివాదానికి పుల్‌స్టాప్ పెట్టడానికి పార్టీలో ముఖ్యనేతలు రంగంలో దిగినట్టు సమాచారం. మరి, ఈ వివాదానికి ఎప్పటిలోపు పరిష్కారం దొరుకుతుందో చూడాలి.

Tags:    

Similar News