People leaving Hyderabad: కరోనా దెబ్బకు హైదరాబాద్ సగం ఖాళీ.. దర్శనమిస్తున్న టులెట్ బోర్డులు
People leaving Hyderabad: తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి.
People leaving Hyderabad: తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో 18వందలు పైగా కేసులు నమోదవుతుంటే ఒక హైదరాబాద్‌లోనే రోజూ దాదాపు వెయ్యికి కొత్త కరోనా కేసులు వస్తున్నాయి. దీంతో నగర ప్రజలు వణికిపోతున్నారు. నగరం విడిచి వెళ్తున్నారు. కొన్నాళ్లు సొంతూళ్లకు వెళ్లి కరోనా తగ్గిన తర్వాత వస్తే బెటర్ అనే ఆలోచనతో ఉన్నారు. దీంతో చాలా మంది నగరం వదిలి వెళ్లిపోతున్నారు. ఉద్యోగాలకు రాజీనామా చేసి ఇల్లు ఖాళీ చేసి సామాన్లతో సహా వెళ్లిపోతున్నవారు చాలా మంది ఉన్నారు. ఫలితంగా హైదరాబాద్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా టులెట్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొత్తగా ఇళ్లలో ఎవరూ దిగట్లేదు. ఉన్న ఇళ్లను ఖాళీ చేస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది.
అన్‌లాక్ 2 తో ఉద్యోగాలు చేసుకోవాలనుకునే వారు ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదు. ఆఫీసుకి వెళ్లగానే ఎవరిలో కరోనా ఉందో, అది మనకు అంటుకుంటుందేమో అనే భయం ఉద్యోగులను వెంటాడుతోంది. రాజకీయ నేతలు, పోలీసులు, డాక్టర్లకు కూడా కరోనా సోకుతుండటంతో.. ప్రజలు బాగా ఆందోళన పడుతున్నారు. కరోనా సోకితే వేలకు వేలు ఖర్చవడమే కాకుండా ప్రాణానికే ప్రమాదం అనే ఆలోచనతో ప్రజలు ఉంటున్నారు. ఉద్యోగం సంగతి తర్వాత ముందు ప్రాణాలతో ఉంటే చాలు అనుకునే పరిస్థితి వచ్చింది. దీంతో భవిష్యత్తులో కరోనా పోయిన తర్వాత మళ్లీ ఏదో ఒక జాబ్ దొరుకుతుందిలే అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితి వచ్చేసింది. దాదాపు సగం హైదరాబాద్ ఖాళీ అయిపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు చాలా మంది సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. కొంతమంది ఇల్లు ఖాళీ చేయకుండానే సామాన్లు ఉంచి వెళ్లిపోయారు. అద్దెలు చెల్లించే పరిస్థితి లేదు. ఓనర్లు అద్దె అడిగితే బతకడానికే డబ్బుల్లేవు.. ఇక అద్దెలేం చెల్లిస్తాం అర్థం చేసుకోండి అని చెబుతున్నారు. దాంతో ఓనర్లకు కూడా గట్టిగా అడిగే పరిస్థితి లేదు.
ముఖ్యంగా ఐటీ జాబ్స్ చేస్తున్న 15 లక్షల మందిలో ఇప్పుడు నగరంలో లక్ష మంది మాత్రమే ఉన్నారనీ.., మిగతా వాళ్లంతా సొంతూళ్లకు వెళ్లి అక్కడి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని తెలిసింది. ఇక పిల్లలు కూడా ఆన్‌లైన్ చదువుల బాట పడుతున్నారు. స్కూల్స్ అన్ని మూతపడ్డాయి. మాల్స్, బట్టల షాపులు, బజార్లు స్వచ్చందంగా మూసివేసుకుంటున్నారు. కరోనా భయంతో వాటిలో పనిచేస్తున్న వాళ్లు కూడా ఉద్యోగాలు చేయడానికి టెన్షన్ పోవడంలేదు. రియల్ ఎస్టేట్ సైతం పతనమైపోయింది. హైదరాబాద్‌కి రోజూ ఐదారు లక్షల మంది వస్తుంటారు. కరోనాకి వ్యాక్సిన్ వస్తే తప్ప భాగ్యనగరంలో సాధారణ పరిస్థితులు వచ్చేలా కనిపించట్లేదు.