People Facing Problems: ఎంఎంటీఎస్ రైళ్లు ఆగిపోవడం వలన ప్రయాణికులు ఎంత నష్టపోతున్నారో తెలుసా?
People Facing Problems: : కరోన మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేశం, రాష్ట్రంలో రవాణా సదుపాయాలు పూర్తిగా అందుబాటులోకి రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగర రవాణాలో ఎంతో కీలకమైన ఎంఎంటీఎస్ రైళ్లు దాదాపు మూడున్నర నెలలుగా షెడ్లకే పరిమితమయ్యాయి. తిరిగి వాటిని ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఉద్యోగులు, చిరువ్యాపారులు, దినసరి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జంట నగరాలు, శివారు ప్రాంతాల ప్రజలకు అతి తక్కువ చార్జీ, తక్కువ సమయంతో రవాణా సదుపాయం కల్పించేందుకు 2003 సంవత్సరంలో మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ ఎంఎంటీఎస్ రైలు సేవలను అందు బాటులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో మొదటిదశ ప్రారంభమైన 2003లో వివిధ మార్గాల్లో రోజుకు సగటున 13 వేల మంది ప్రయాణించగా, 2019 లెక్కల ప్రకారం ప్రతి రోజూ 1.65 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు.
కరోనా ప్రభావంతో మొదట దేశవ్యాప్తంగా ప్యాసింజర్ రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేయగా, సరుకులను రవాణా చేసే గూడ్స్ రైళ్లను నడిపించారు. కరోనా నేపథ్యంలో మార్చి 16 నుంచి 31 వరకు రైళ్లను నిలిపివేయాలని నిర్ణయించారు. కానీ వైరస్ వ్యాప్తి అంతకంతకు పెరిగిపోతుండడంతో మార్చి 22న జనతా కర్ఫ్యూను విధించారు. మార్చి 23 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించారు. దీంతో మార్చి 31 నుంచి రైళ్లు నడుస్తాయని భావించిన ప్రయాణికులు ప్రధాని ప్రకటనతో నిరాశకు గురయ్యారు.
సాధారణ ప్రయాణికుల సౌకర్యార్థం జూన్ 10 నుంచి ఎంపిక చేసిన ప్రాంతాలకు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్ల నుంచి రోజుకు సగటున నాలుగు రైళ్లను నడిపిస్తున్నారు. కానీ జంటనగరాలు, శివారు ప్రాంతాల్లో కీలకంగా ఉండే ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తీసుకురాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
లాక్‌డౌన్ కారణంగా మార్చి 16 నుంచి ఇప్పటివరకు ఎంఎంటీఎస్ రైళ్లు జంట నగరాల్లోని పలు స్టేషన్లలోని షెడ్లకే పరిమితమయ్యాయి. నగరంలో ఇటు ఆర్టీసీ లోకల్ బస్సులు నడవక పోవడంతోపాటు ఎంఎంటీఎస్ సర్వీసులు కూడా అందుబాటులో లేకపోవడంతో రోజువారీగా కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, చిరు వ్యాపారులు, ఆస్పత్రులకు వెళ్లే వృద్ధులు అవస్థలు పడుతున్నారు. ఎంఎంటీఎస్ రైళ్లలో విధులు నిర్వర్తించే డ్రైవర్లను ఇతర రైళ్లలో పనిచేసేందుకు తరలిస్తున్నారు. దేశంలో, నగరంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎంఎంటీఎస్ రైళ్లను ఇప్పట్లో ప్రారంభించే పరిస్థితులు కనిపించడంలేదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. కరోనా కారణంగా కకావికలం అయిన ప్రజల జీవితాలు సాధారణ స్థితికి రావడానికి చాలా కాలమే పట్టనుంది. రానున్న కాలంలో సామాన్యుల కష్టాలు రెట్టింపు కానున్నాయి.