Peddavagu Project: పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి..జలదిగ్బంధంలో 14 గ్రామాలు
Peddavagu Project: భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో భద్రాద్రి -కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు 250 మీటర్ల పొడవున గండి పడింది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 18.6 అడుగులు. మూడు క్రస్ట్ గేట్లలో ఒకటి పనిచేయకపోవడంతో గురువారం రాత్రి 7.45 సమయంలో కట్ట పూర్తిగా తెగిపోయింది.
Peddavagu Projectతెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో భద్రాద్రి -కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు 250 మీటర్ల పొడవున గండి పడింది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 18.6 అడుగులు. మూడు క్రస్ట్ గేట్లలో ఒకటి పనిచేయకపోవడంతో గురువారం రాత్రి 7.45 సమయంలో కట్ట పూర్తిగా తెగిపోయింది.
పెద్దవాగుకు గండిపడటంతో దిగువన అశ్వారావుపేట మండలం గుమ్మడపల్లి కోయరంగాపురం, రమణక్కపేట, కొత్తూరు గ్రామాలకు పాక్షికంగానష్టం జరిగింది. ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, ఒంటిబండి, కోయమాదారం, కొత్తపూచిరాల, పాతపూచిరా, అల్లూరినగర్, సొందిగొల్లగూడెం, వసంతవాడ, గుళ్లవాయి, వేలేరుపాడు గ్రామాలకు భారీగా నష్టం వాటిల్లింది.
కొన్ని గ్రామాల్లో పలు ఇళ్లు వరదలో కొట్టుకుపోయాయి. సహాయక చర్యలుచేపట్టేందుకు వరద ప్రభావిత ప్రాంతాలకు అధికారులు చేరుకునే పరిస్థితి కూడా లేదు. దీంతో వారంతా వేలేరుపాడులో ఉండిపోయారు. దాదాపు 2వేల కుటుంబాలు ఎవరి దారిన వారు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం నుంచి విద్యుత్తు పూర్తిగా నిలిచిపోయింది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ఆ గ్రామాల్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు. పెద్దవాగుకు గండిపడిన నేపథ్యంలో ప్రాణనష్టం లేకుండా చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. విషయం తెలుసుకుని జిల్లా కలెక్టర్ జితేష్, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్షించారు. గండి పూడ్చేందుకు రూ. 20కోట్ల వరకు ఖర్చు అవుతుందని జలవనరులశాఖ డీఈ తెలిపారు.
వరద పెరుగుతుండటంతో వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని 12 గ్రామాలకు ప్రమాదం పొంచి ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైతే హెలికాప్టర్లు వాడాలని, ప్రాణనష్టం జరగకుండా చూడాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారని అధికారులు తెలిపారు. మరోపక్కపెద్దవాగు ప్రాజెక్టు గండికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. మొత్తం మూడు గేట్లు ఉండగా, రెండ్రోజుల కిందటే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది. భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా ముందస్తుగా మూడు గేట్లలో ఒక్కటీ తెరవకపోవడంతోనే ఈ పరిస్థితికి దారితీసిందని మండిపడుతున్నారు.