వరంగల్‌‌లో హైటెక్‌ హంగులతో పెట్‌ పార్క్‌ ఏర్పాటు

Warangal: కుక్కలు నడిచేందుకు ప్రత్యేకంగా ట్రాక్ ఏర్పాటు

Update: 2022-04-26 03:41 GMT

వరంగల్‌‌లో హైటెక్‌ హంగులతో పెట్‌ పార్క్‌ ఏర్పాటు

Warangal: పట్టణాల్లో పచ్చదనంతో ఉండే పార్కుకు వెళితే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. రోజంతా పనుల్లో నిమగ్నమై... కుటుంబంతో కాసేపు ప్రకృతితో గడుపుతుంటారు. మరి ఇళ్లలో ఇష్టంగా పెంచుకునే కుక్కల పరిస్థితేంటి....? వాటి ఆనందం కోసం... ప్రత్యేకమైన పార్కు ఒకటి వరంగల్ లో ఉంది.

శునకాల కోసమే హన్మకొండలో ప్రత్యేకంగా తయారు చేసిన ఓ పార్కు ఆకట్టుకుంటోంది. పెంపుడు జంతువుల్లో మొదటి ప్రాధాన్యత ఎక్కువగా శునకానికే ఉంటుంది. చాలామంది వీటిని తమ కుటుంబంలో ఒకటిగా భావిస్తూ... వాటి ఆలనా పాలనా చూస్తారు. విశ్వాసానికి మారు పేరుగా నిలిచే కుక్కల్లో రకాలు అన్నీ ఇన్నీ కావు. బ్రీడ్‌ను బట్టి వాటి ఖరీదు వేలు.. లక్షల్లోనూ ఉంటుంది. డబ్బుకు వెనుకాడకుండా.. కొందరు వీటిని కొనుగోలు చేస్తే మరికొందరు తమకు తెలిసినవారి నుంచి తెచ్చుకుని ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. తెలుపు, నలుపు, గోధుమరంగులతో కనిపించే ఈ శునకాలు... ఎవ్వరినైనా సరే ఇట్టే ఆకట్టుకుంటుంటాయి.

నగరాల్లో పెంపుడు కుక్కల ఆలనాపాలనా ఇబ్బందికరంగానే ఉంటుంది. అపార్ట్‌మెంట్లలో, అద్దె ఇళ్లలో ఉండేవారికి వీటిని బయట తిప్పడం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇలాంటి వారి ఇక్కట్లు తీర్చేందుకే హన్మకొండలో పెట్‌పార్కును నిర్మించారు కార్పొరేషన్‌ అధికారులు. 48 లక్షల వ్యయంతో.. సకల హంగులతో రూపుదిద్దుకున్న ఈ పార్కు ఆకట్టుకుంటోంది. ఉదయం, సాయంత్ర వేళల్లో కుక్కలు నడిచేందుకు ప్రత్యేకంగా ట్రాక్ ఏర్పాటు చేశారు. ఆడుకునేందుకు అన్ని సౌకర్యాలతో అందంగా ఈ పార్కును నిర్మించారు.

కుక్కలకు దాహం వేస్తే తాగేందుకు నీటి కొలను నిర్మించారు. హైదరాబాద్ తర్వాత శునకాల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కు ఇదే కావడంతో నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్‌ నగరంలో హైటెక్‌ హంగులతో పెట్‌ పార్క్‌ ఏర్పాటు చేశామని. బాలసముద్రంలో నిర్మించిన పెట్‌ పార్క్‌ ప్రత్యేకంగా ఉందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ అన్నారు.

Tags:    

Similar News