Parents Death Children Became Orphans : తల్లిదండ్రుల మరణంతో అనాథలైన చిన్నారులు
Parents Death Children Became Orphans : చిన్న తనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ముగ్గురు పిల్లలు ఆసరా కోసం ఎదురు చూస్తున్నారు. చిన్నతనంలోనే అనారోగ్యంతో తల్లిని మూడు రోజుల క్రితం తండ్రిని కోల్పోయిన పిల్లలు అనాథలుగా మిగిలారు. తన కొడుకు, కోడలు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో వికలాంగురాలైన వృద్దురాలు కూడా పిల్లలతో పాటే అనాథగా మారింది. దీంతో వారిని ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు. ఈ హృదయవిదారక సంఘటన ఖానాపూర్ మండలంలోని మండలంలోని సత్తన్‌పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తివివరాల్లోకెళితే గ్రామానికి చెందిన ఇరవేని కొమురయ్య, పద్మలకు ముగ్గురు సంతానం. కాగా పద్మ 15ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి తండ్రే అన్నీ తానై ఇద్దరు కుమారులు, కూతుర్ని కూలిపనులు చేసుకుంటూ పెంచుతున్నాడు. ఈ క్రమంలోనే తండ్రి కొమురయ్య కాలుకు రెండేళ్ల క్రితం తీవ్ర గాయమైంది. ఆ గాయం మానక పోవడంతో అతను అనారోగ్యం బారిన పడ్డాడు. నిజామాబాద్, హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోవడం కోసం అప్పులు చేసాడు. ఎంత ఖర్చులు చేసినా ఆ గాయం మాత్రం నయం కాలేదు.
ఆ తరువాత డబ్బు అందుబాటులో లేకపోవడంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాడు. తండ్రి పరిస్థితిని చూసిన పిల్లలు కుమారులు సాయి(11) 9వ తరగతి పూర్తి చేయగా, మనోజ్(12) పదో తరగతి పూర్తి చేశాడు. కూతురు మల్లేశ్వరి(15) పదో తరగతి వరకు చదివి చదువును మధ్యలోనే ఆపేసి తండ్రికి సపరియలు చేసే వారు. కాగా ఈ మధ్య కాలంలోనే ఆరోగ్య పూర్తిగా క్షిణించడంతో కొమురయ్య (40) శనివారం మృతి చెందాడు. అతని అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులు లేకపోవడంతో గ్రామస్తులు, మిత్రులు చందాలు వేసి అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి చనిపోవడంతో ముగ్గురు పిల్లలు దిక్కుతోచని పరిస్థితిలో వారి నానమ్మ వద్దే ఉంటున్నారు. వారు ఉండడానికి ఇళ్లు తప్ప ఎలాంటి ఆధారం లేదు. ఇక వారినానమ్మ వికలాంగురాలు కావడంతో ఏమిచేయని పరిస్థితి. ఎవరైనా దాతలు ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.