Palla Rajeshwar Reddy: దొంగ ఓట్లు నమోదు చేయించిందీ బీజేపీనే.. కోర్టు కెళ్లిందీ వాళ్లే..
MLC Palla Rajeshwar Reddy: ఓటమి భయంతోనే బీజేపీ మునుగోడులో నకిలీ ఓటర్ల డ్రామాకు తెరలేపిందన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి.
MLC Palla Rajeshwar Reddy: ఓటమి భయంతోనే బీజేపీ మునుగోడులో నకిలీ ఓటర్ల డ్రామాకు తెరలేపిందన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి. మునుగోడులో నకిలీ ఓట్లపై హైకోర్టు విచారణ అంశంపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర విచారణ సంస్థలన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకున్న బీజేపీ తమ అనుబంధ సంస్థల కార్యకర్తలను ఓటర్లుగా చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయన్నారు. అందుకే కోర్టుకు వెళ్లే నాటకానికి తెర తీశారన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత నుంచి దొంగ ఓట్లు నమోదు చేయించింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు.
మునుగోడులో దొంగ ఓట్లపై బీజేపీ వ్యవహారం దొంగే దొంగ అన్నట్లు ఉందని సెటైర్ వేశారు. నకిలీ ఓట్లుగా 40 శాతం తొలగించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఓట్లు పోయాయి కాబట్టి ఓడిపోయామని చెప్పటానికే ఈ ప్రయత్నం చేస్తున్నారని పల్లా పేర్కొన్నారు. 18వేల కోట్ల రూపాయలకు రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయింది నిజం కాదా అని ప్రశ్నించారు. కేంద్ర బలగాలు తేవాలని చెప్తున్నారు. ఎన్ని బలగాలు తెచ్చిన నాగార్జునసాగర్, హుజుర్ నగర్ ఫలితమే ఇక్కడ రీపీట్ అవుతుందన్నారు. రాజగోపాల్ రెడ్డిని రాజకీయంగా బొంద పెట్టడం ఖాయమన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా రాజగోపాల్ రెడ్డి ఓటమి తప్పదని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.