Telangana Congress: ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు
Telangana Congress: తెలంగాణ నుంచి ఒకరికి ఏఐసీసీలో అవకాశం
Telangana Congress: టీకాంగ్రెస్‌లో ఆ ఇద్దరు సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలు కూడా అందులో ఒకరు మాజీ పీసీసీ చీఫ్ అయితే మరొకరు సీనియర్ నేత. పైగా ఇద్దరూ ఒకే జిల్లాకు చెందినవారు. వారెవరో కాదు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మరొకరు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ ఇద్దరికి పార్టీలో మంచి పట్టుంది. ఒకరేమో పీసీసీ పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఏఐసీసీలో పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరొకరు చివరి నిమిషం వరకు పీసీసీ రేసులో ఉండి ఆ పదవి దక్కకపోవడంతో ఏఐసీసీలోనైనా పదవి ఇస్తారని ఆశించారు. అయితే ఇంతలోనే ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ మధ్యే టీ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నియమించబడ్డారు. అయితే మొదట్లో సీడబ్ల్యూసీలో అవకాశం కల్పిస్తారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆశించారు. దీనిపై ఏఐసీసీ కూడా హామీ ఇచ్చినట్టు అనేక సార్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన సన్నిహితులకు చెప్పినట్టు సమాచారం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
ఇక కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటించడంతో మరో సీనియర్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లైన్ క్లియర్ అయినట్లుగా పార్టీలో చర్చ నడుస్తోంది. అయితే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్టార్ క్యాంపెయినర్ పదవిని ఇష్ట పూరితంగానే తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదంతా ఒక సైడ్ అయితే తనకు పోటీ రాకుండా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలివిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని రాష్ట్రానికి పరిమితం చేసేలా చక్రం తిప్పారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణ నుంచి ఒకరికి ఏఐసీసీ కమిటీలో అవకాశం ఉందని హస్తం పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎలాగో పోటీలో లేకపోవడంతో ఉత్తమ్‌కు ఆ కీలక పదవి ఖాయమనే చర్చ నడుస్తోంది. ఉత్తమ్‌కు సీడబ్ల్యూసీ లేక ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చి, ఏదైనా రాష్ట్రానికి ఇంఛార్జిగా పంపే అవకాశం ఉన్నట్టు సమాచారం. గతంలో పాండిచ్చేరి కాంగ్రెస్‌లో ఇబ్బందులు తలెత్తడంతో అక్కడ పార్టీని చక్కదిద్దే బాధ్యతను ఉత్తమ్‌కు ఏఐసీసీ అప్పగించింది. దీన్నిబట్టి చూస్తే.. భవిష్యత్‌లో పాండిచ్చేరి ఇంఛార్జిగా ఉత్తమ్‌ను నియమించే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.