ఉల్లి కోసినా ఘాటే.. కొన్నా ఘాటే

ఉల్లి కోసినా ఘాటె.. కొన్నా ఘాటే అన్నట్లే ఉంది. అవును.. ఉల్లిపాయలు కొనాలంటేనే వాటి ధర ఘాటుకు కన్నీళ్లొస్తున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరతో అటు మహిళలు, వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు.

Update: 2020-11-02 15:05 GMT

ఉల్లి కోసినా ఘాటె.. కొన్నా ఘాటే అన్నట్లే ఉంది. అవును.. ఉల్లిపాయలు కొనాలంటేనే వాటి ధర ఘాటుకు కన్నీళ్లొస్తున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరతో అటు మహిళలు, వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. అధిక వర్షాలతో దిగుబడికి దెబ్బ పడటంతో ఉల్లి ధరతోపాటు కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

కొండెక్కిన ఉల్లి ధర సామాన్యుడికి పెనుభారంగా మారింది. ప్రస్తుతం ఉల్లి ధర వింటేనే పేద, మధ్యతరగతి ప్రజలు వణికిపోతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కిలో ఉల్లి ధర 100 నుంచి 120 రూపాయల వరకు పలుకుతోంది. దీంతో కోయకుండానే ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోందని వాపోతున్నారు ప్రజలు.

అటు ఉల్లి ధరలు తరచూ పెరుగుతుండటంతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు వ్యాపారులు. ఉల్లి ధరను ప్రభుత్వం నియంత్రించి అందరికీ అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఉల్లిని వినియోగించకుండా ఫాస్ట్‌ఫుడ్‌ రన్‌ చేయాలేమంటున్న వ్యాపారులు.. ఉల్లిని పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు.

ఇక ఉల్లిధర మాట ప్రక్కన పెడితే అటు నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలు, కరోనా ఎఫెక్ట్‌తో ధరలు అమాంతం పెరగడంతో నిత్యావసర సరుకులు అటు కొనలేక.. ఇటు తినలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

మొత్తానికి అటు కరోనా, ఇటు అధిక వర్షాలు జనాలను నిత్యావసర వస్తువులు కొనలేని స్థితికి తీసుకొచ్చాయి. అయితే ఇప్పటికైనా సామాన్యుడిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలి.

Tags:    

Similar News