మహబూబ్‌నగర్ జిల్లాలో ఉల్లి రైతుకు కన్నీరు...
Mahbubnagar: మద్దతు ధర కోసం ఉల్లి రైతుల ఎదురుచూపులు
Mahbubnagar: తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందటారు... కానీ ఈ ఉల్లి ఎప్పుడు ఎవరికి మేలు చేస్తుందో అంతుచిక్కడం లేదు. ఒక్కొసారి వినియోగదారుడికి కోయకుండానే కన్నీరు తెప్పించే ఉల్లీ.. ఈ సారి మాత్రం సాగు చేసిన రైతుకు కన్నీరు తెప్పిస్తుంది. పండించిన ఉల్లికి మద్దతు ధర పూర్తిగా పడిపోవడంతో మార్కెట్లలోకి తరలించేందుకు రైతులు జంకుతున్నారు. కొంతమంది తక్కువ ధర వస్తుండటంతో వ్యాపారులకు విక్రయించకుండానే తిరిగి ఇంటింటికీ తిరిగి అమ్ముతున్నారు.
ఉమ్మడి మహబూబ్‍నగర్ జిల్లాలోని ఉల్లి సాగు చేసిన రైతులు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. సాగు చేసిన ఉల్లికి మద్దతు ధర రాకపోవడంతో ఉల్లి రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో సాగుచేసిన ఉల్లిని మార్కెట్లోకి తరలించకుండా పొలాల వద్దనో, ఇంటి వద్దనో ఉంచేసుకుంటున్నారు. మరి కొంతమంది రైతులు ఇంటింటికీ తిరిగి అమ్ముకుంటున్నారు. ఊహించని విధంగా ఉల్లి ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో ఉల్లి సాగు రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఈ సారి ఉల్లి సాగు చేసిన రైతులకు పంట దిగుబడి ఆశాజనకంగా ఉన్నా... ధరలు ఉల్లి రైతు కంట నీరు తెప్పిస్తున్నాయి. . అసలు పెట్టుబడి మాట దేవుడెరుగు... కనీసం రవాణా ఖర్చులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. పదేళ్లలో రాని ఉల్లి దిగుబడి ఈ ఏడాది వచ్చింది. కానీ ఆశించినంతగా గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి మహబూబ్‍నగర్ జిల్లా వ్యాప్తంగా సుమారుగా 2,800 ఎకరాల్లో రైతులు ఉల్లి పంటను సాగు చేశారు. నాణ్యతను బట్టి క్వింటా ఉల్లికి కనిష్ఠంగా 500 నుంచి 800 వరకూధర లభిస్తుంది. ఐతే 1800 నుంచి 2000 వరకు మద్దతు ధర వస్తుందని ఆశించారు రైతులు, పుర్తిగా తగ్గిన ఉల్లి ధర తమను తీవ్ర నష్టాల్లోకి నెట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అధిక ధర ఉంటుందని చాలా మంది రైతులు ఉల్లి పంటను సాగుచేశారు. కానీ రెండు వారాల క్రితం కనిష్ఠంగా 1400, నుంచి1600 వరకు ధర లభించింది. కానీ ఈ వారం మాత్రం అందులో సగానికి తగ్గిపోయింది. కనీస మద్దతు ధరకు ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.