Telangana: రైతు కంట కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి

Telangana: గిట్టుబాటు ధర లేక బెంబేలెత్తుతున్న రైతు

Update: 2022-03-13 08:00 GMT

Telangana: రైతు కంట కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి

Telangana: తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందటారు. కానీ ఇప్పుడు అదే ఉల్లి ఎవరికి మేలు చేస్తుందో అంతు చిక్కడం లేదు. ధరల పెరుగుదలతో ఓ వైపు కొనుగోలుదారులకు కన్నీరు పెట్టిస్తుంటే మరోవైపు గిట్టుబాటు ధరకు అమ్ముడుపోక సాగు చేసిన రైతు కంట కన్నీరు పెడుతున్నాడు. మార్కెట్‌లలో మద్దతు ధర లభించక పండిన పంటను పొలాల్లో ఉంచలేక ఉల్లి రైతు నానా తిప్పలు పడుతున్నాడు.

మహబూబ్‍నగర్‍ జిల్లాలో ఉల్లి రైతులు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. సాగు చేసిన ఉల్లికి మద్దతు ధర దక్కకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. దీంతో సాగు చేసిన ఉల్లిని మార్కెట్లోకి తరలించకుండా పొలాల వద్ద, ఇంటి వద్దనో పోసి పెట్టారు. ఊహించని విధంగా ఉల్లి ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. వివిధ ప్రాంతాల నుంచి మార్కెట్లోకి కొత్త ఉల్లి రావడంతో 2 వేల రూపాయల వరకు పలికిన ధర ఇప్పుడు ఒక్కసారిగా వెయ్యికి పడిపోయిందని బాధిత రైతులు వాపోతున్నారు.

అయితే మార్కెట్లకు ఒక్కసారిగా ఉల్లి పోటెత్తడంతోనే ఈ పరిస్థితి నెలకొందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. ఈ సారి సంవృద్దిగా వర్షాలు కురవడంతో ఉల్లి సాగు దిగుబడి పెరిగిందని దిగుబడి పెరగడంతో ధర లభించడం లేదంటున్నారు. రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.వరి పంట వేయద్దని ప్రభుత్వం చెప్పిన మాటలు విన్న రైతులు ఇలా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వ్యాపారులు నిలువునా దోచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మద్దతు ధరకు ఉల్లిని ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు. 

Tags:    

Similar News