సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ పథకంపై కొనసాగుతున్న అఖిలపక్ష భేటీ
CM KCR: పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో దళిత యువత స్వయం ఉపాధి అన్వేషించాలి-సీఎం కేసీఆర్
CM KCR: దళితుల అభ్యున్నతికి సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ పథకం పటిష్టంగా అమలు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రగతి భవన్ లో దళిత్ ఎంపవర్ మెంట్ పథకంపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో దళిత యువత స్వయం ఉపాధి అన్వేషించాలన్నారు. గోరటి వెంకన్న పాడిన గల్లీ చిన్నది పాటను మనస్సుపెట్టి వింటే దళితుల సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయన్నారు. దళితుల్లో అర్హులైన కుటుంబాల గణన జరపాలన్నారు.
సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ పథకానికి ఎస్సీ సబ్ ప్లాన్ కు అదనంగా బడ్జెట్ లో వెయ్యి కోట్లు కేటాయించాలని భావిస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. మరో ఐదు వందల కోట్లు పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. రాబోయే మూడు నాలుగేండ్లలో 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. దళిత సాధికారతను సాధించడానికి మిషన్ మోడ్ లో పనిచేయడానికి నిశ్చయించుకున్నామని.. ఇందుకు అంతా కలిసి రావాలని సీఎం కేసీఆర్ అఖిలపక్ష నేతలను కోరారు.