మహిళలు, యువతులు, చిన్నారులన్న తేడాలేదు వావీ వరుసలు లేనే లేవు. మృగాళ్లా ప్రవర్తిస్తున్నారు కామాంధులు. హైదరాబాద్ శివారులో దిశపై అత్యాచారం యావత్ దేశ ప్రజల మనసులను చలింపజేసిన ఘటన. మానవ మృగాళ్ల అరాచకాలతో సభ్య సమాజం తలదించుకున్న ఘటన అది. ఆ రాత్రే తనకు కాలరాత్రి అని తెలియక దుర్మార్గుల చేతిలో అత్యాచారం కావించబడిన దిశ ఘటన జరిగి సరిగ్గా ఏడాది.
దిశా... ఈ పేరు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు అన్నీ కూడా విస్మయం వ్యక్తం చేశాయి. శంషాబాద్ శివారులోని తొండుపల్లి టోల్‌గేట్ సమీపంలో నవంబర్ 27న వెటర్నరీ డాక్టర్ దిశ బైక్‌కు పంచర్ చేసి డ్రామా ఆడి అనంతరం బలవంతంగా తీసుకెళ్లి నలుగురు దుర్మార్గులు హైదరాబాద్ శివారుల్లో షాద్‌నగర్ వద్ద అత్యాచారానికి ఒడిగట్టి కిరాతకంగా సజీవ దహనం చేయడం చాలా మందిని కలవరపెట్టింది. ముందు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత విచారణ చేపట్టారు.
ఘటన జరిగిన మరుసటి రోజే కేసును చేధించి వెంటనే నలుగురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటూ దేశవ్యాప్తంగా నిరసనలు జరగడమే కాకుండా వాళ్ళను కాల్చి చంపాలని మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. నలుగురు నిందితుల్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తీసుకుని వెళ్ళారు. ఆ సమయంలో వారిని జైలుకు తీసుకెళుతుండగా ప్రజలు వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
విచారణంలో భాగంగా నలుగురు నిందితులను సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసేందుకు తీసుకెళ్లగా వారు ఎదురు తిరిగి పోలీసులుపై దాడికి దిగడంతో ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు చెప్పారు. అప్పుడు జరిగిన పోలీసుల కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేసినా మానవహక్కుల సంఘంతో పాటు పలు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఉద్దేశపూర్వకంగానే నిందితులను చంపేశారంటూ పోలీసులపై ఫిర్యాదు చేశాయి. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వాటిపై ఇంకా విచారణ కొనసాగుతోంది.
అయితే, ఈ సంఘటన తర్వాత పోలీస్ శాఖలో కొన్ని కీలకమైన మార్పులు వచ్చాయి. జీరో ఎఫ్‌ఐఆర్ అనే విధానం అమలులో ఉన్నా, ఈ విధానాన్ని పటిష్టం చేయాలని అప్పట్లో పోలీస్ శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే డయల్ 100కు వచ్చే కాల్స్ పట్ల నిర్లక్ష్యం చేయకుండా, తక్షణమే స్పందించాలని ఉన్నతాధికారులు నుంచి ఆదేశాలు వెలవడ్డాయి. మహిళలు, విద్యార్థినులు, యువతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే విధం గా ఏపీ సర్కార్ దిశ చట్టాన్ని రూపొందించి, అమల్లోకి తీసుకొచ్చింది. దిశ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేసినా మృగాళ్లలో మార్పు మార్పురాలేదు. ఇలాంటి ఘటనలు ఇంకా అనేక చోట్ల వెలుగుచూస్తూనే ఉన్నాయి. అమ్మాయిలపై అఘాయిత్యాలకు అడ్డుకట్టపడటం లేదు.
ఇదిలా ఉండగా దిశ అత్యాచారం, హత్యపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాగా తీస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. విడుదలకు సిద్ధమవుతుంది కూడా. అయితే ఈ చిత్రాన్ని నిలిపేయాలంటూ దిశ తండ్రి, దిశ నిందితుల కుటుంబ సభ్యులు హై కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు షోకాజు నోటీసులు అందించింది. దిశ ఎన్‌కౌంటర్ సినిమాపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
మగ మృగాళ్లు సంచరించే ఈ ఆధునిక సమాజంలో స్త్రీలకు రక్షణ లేదా..? ఇంతపెద్ద వ్యవస్థలో ఇన్ని చట్టాలు వచ్చినా ఆడవాళ్లు స్వేచ్ఛగా బతకలేరా..? ఇంకెన్నాళ్లు ఈ కన్నీళ్లు.. పుట్టకముందే భృణహత్యలు.. పుట్టాక ఈసడింపులు. ప్రేమిస్తే పరువు హత్యలు... ప్రేమించకపోతే ప్రేమోన్మాది వదలడు... ఇలా ఏదో ఒక కారణంతో అమ్మాయిలు బలవుతూనే ఉన్నారు.