కరీంనగర్ జిల్లాలో అందని పాఠ్య పుస్తకాలు

Karimnagar District: జిల్లాకు చేరుకున్నవి 50శాతం పుస్తకాలు, రెండేళ్లుగా అందని ఏకరూప దుస్తులు

Update: 2022-06-28 01:45 GMT

కరీంనగర్ జిల్లాలో అందని పాఠ్య పుస్తకాలు

Karimnagar District: కరీంనగర్ జిల్లాలో పాఠశాలలు ప్రారంభమై 15 రోజులు అవుతున్నా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందక చదువులు సాగట్లేదు. ఆంగ్ల మాధ్యమం జాప్యంతో జిల్లాకు ఇంకా పుస్తకాలు చేరుకోలేదు. అధికారులు చెబుతున్న మాటలు నీటి మీద రాత లానే మిగిలిపోయాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు..

గోడౌన్‌కు చేరుకున్న 50 శాతం పుస్తకాలు

4లక్షల 66వేల పుస్తకాలకు ప్రతిపాదనలు

వచ్చిన పుస్తకాలు 2లక్షల 3వేలు

కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ స్కూల్స్ ప్రారంభం అయిన నాటికే తరగతుల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేయాల్సిన ప్రభుత్వం దానిపై దృష్టి సారించకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకూ 50 శాతం మాత్రమే పుస్తకాలు జిల్లా కేంద్రంలోని గౌడౌన్ కి చేరుకున్నాయి..

సగం పుస్తకాలతో చదువు ఎలా సాగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంగ్లీష్, తెలుగు మీడియాలకు కలిపి ద్విభాషా పుస్తకాలు ముద్రించే పనిలో అలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఒకటి నుండి పదో తరగతి వరకూ తెలుగు, హిందీ,ఇంగ్లీష్ పరిసరాల విజ్ఞానం పర్యావరణ విద్య తదితర పుస్తకాలు మొత్తం 4లక్షల 66వేలు కావాలని జిల్లా వైద్యశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు.ఈ నెల 24 వరకూ జిల్లాకు కేవలం 2లక్షల 3వేల పుస్తకాలు మాత్రమే వచ్చాయి. దీంతో విద్యార్థులకు ఇంత వరకూ పుస్తకాలు అందలేదు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందించకపోవడంపై విద్యార్థి సంఘ నేతలు మండిపడుతున్నారు.

ఏకరూప దుస్తులు అందించని ప్రభుత్వం

పుస్తకాలు రావడానికి మరో నెల రోజులు

చాలా మంది విద్యార్థులు పాఠ్య పుస్తకాలు రావడం ఆలస్యమైతే గతంలో అదే తరగతి చదువుకున్న విద్యార్థుల నుంచి సేకరించిన పాఠ్య పుస్తకాలతో చదువుకునే వారు. అయితే ఈసారి ద్విభాషా పుస్తకాలు కావడంతో ఆ అవకాశం లేకుండాపోయింది. ఇంకా నెల రోజుల వరకు పుస్తకాలు రావడానికి సమయం పట్టొచ్చని... కేవలం నోట్ బుక్ లతో కాలం వెళ్లదీస్తున్నారు విద్యార్థులు. ఇంకోవైపు కరోనా సమయం నుండి రెండేళ్లుగా ప్రభుత్వ పాఠశాలలలోని విద్యార్థులకు ఏక రూప దుస్తులు అందించలేదు.

గతంలో ఈ సమయానికి బట్ట తెచ్చి కుట్టించి పాఠశాలల విద్యార్థులకు అందించేవారు. ఇంతవరకు మహిళా సంఘాలకు ఏకరూప దుస్తుల టెండర్ల ప్రక్రియ ఆదేశాలు రాకపోవడంతో విద్యార్థులకు దుస్తుల పంపిణీపై నీలి నీడలు కమ్ముకున్నాయి. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు త్వరగా అందించడంతో పాటు దుస్తులు పంపిణీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Tags:    

Similar News