Nizamabad police: నిజామాబాద్ లో ఏడాదిన్నర పసి బాలుడి హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ హత్యలో నాగరాజు నిందితుడిగా తేల్చారు. బాసరకు చెందిన నాగరాజు నిజామాబాద్‌కు వచ్చి లేబర్ పని చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో రెంజల్ మండలం దండిగుట్టకు చెందిన రమేశ్‌తో పరిచయం ఏర్పడింది. ఆయన భార్యతో నాగరాజు సన్నిహితంగా ఉంటున్నాడు. రమేశ్‌కు విషయం తెలియగా నవీపేట్‌కు తీసుకెళ్లి చితకబాదాడు. అప్పటి నుంచి రమేశ్‌పై నాగరాజు కోపం పెంచుకున్నాడు. తన భర్త ఓ కేసు విషయంలో సంగారెడ్డి జైలులో ఉన్నాడని రమేశ్ భార్య నాగరాజుకు చెప్పింది. ఈ నెల 18న కొడుకు అంజితో కలిసి ఆమె సంగారెడ్డి బయలుదేరింది. మార్గమధ్యంలో డబ్బులు అయిపోవడంతో నాగరాజుకు చెప్పగా ఇద్దరూ తిరుగు ప్రయాణమయ్యారు.
అదే రోజు సాయంత్రం నిజామాబాద్ చేరుకున్నారు. కొడుకు బస్టాండ్‌లో ఏడుస్తుండటంతో రమేశ్ భార్య పాలు తెచ్చేందుకు వెళ్లింది. బస్టాండ్‌లో తల్లి దగ్గర నుంచి బాబును ఎత్తుకెళ్లిన నాగరాజు అదే రోజు రాత్రి 11 గంటలకు అర్సపల్లికి వచ్చి ఫుల్లుగా మద్యం తాగి.. అదే మత్తులో సిమెంటు దిమ్మతో బాలుడిని తీవ్రంగా కొట్టాడు. తలకు బలమైన గాయమవడంతో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అదే రాత్రి బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లి నాగరాజు బాసరకు చేరుకున్నాడు. మరుసటి రోజు రైల్వే స్టేషన్ సమీపంలో పొదల్లో బాలుడి మృతదేహాన్ని పారేసి అక్కడి నుంచి పరారయ్యాడు. నాగరాజు బాలుడి మృతదేహాన్ని భుజాన వేసుకొని తీసుకెళ్తున్న విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. 25న జిల్లా కేంద్రంలో నిందితుడు కనిపించడంతో మహిళ బంధువులు చితకబాదారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునీ విచారించడంతో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.