OzoNIT: కరోనా వైరస్ భయంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక రూపంలో అది ప్రజలను బాధిస్తోంది. కేసులు చూసినప్పడు వైరస్ ఎలా వ్యాపిస్తోందో అర్ధంకాని పరిస్థితి, కొన్ని సార్లు మనం తెచ్చుకునే పచారీ సరుకులు, కూరలు, కరెన్సీ, ద్వారా కూడా వస్తోందని తెలుస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి నిరోధానికి వరంగల్ నిట్ కు చెందిన ప్రోఫెసర్ సరికొత్త పరికరాన్ని తయారు చేశారు. వరంగల్ నిట్ క్యాంపస్ ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ ఫ్రొపెసర్ ప్రొఫెసర్ డాక్టర్ హరినాథ్ ఓజోనిట్ పేరుతో ఫ్రిజ్‌ని రూపోందించారు.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల ముందున్న ప్రస్తుత సమస్య కరోనా వైరస్. ఏ రూపంలో కరోనా వచ్చి దాడి చేస్తుందో తెలియని పరిస్థితి. పాలు, నీళ్లు, కూరగాయలు, మందులు వంటి నిత్యావసరాలు రోజు కొనక తప్పదు. మరి అలాంటపుడు ప్రతి వస్తువును శానిటైజ్ చేయడం సాధ్యమా? కరోనా రాకుండా ఆపేదెలా? జనం ఇది తెలియక తలపట్టుకుంటున్న నేపథ్యంలో నిట్‌లో భౌతికశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ హరినాథ్ ఓజోనిట్ పేరుతో ఫ్రిజ్ వంటి పరికరాన్ని రూపోందించారు.
నిత్యావసరాలను, సరుకులను ఫ్రిడ్జ్ వంటి ఈ పరికరంలో ఉంచి అందులోకి ఓజోన్ వాయువును పంపిస్తారు. 30 నిమిషాల వరకు ఓజోన్ వాయువులో ఉంచడం వల్ల వస్తువులపై ఉన్న అన్ని రకాలైన వైరస్‌లు తొలిగిపోతాయని హరినాథ్ తెలిపారు. కరోనా వ్యాప్తివాహక వస్తువులైన కూరగాయలు, పండ్లు, పాలు, ఆభరణాలు, సెల్‌ఫోన్‌లు, వాచ్‌లు, దుస్తులు, డెలివరీ ప్యాకింగ్‌లు ఇలా అన్నింటినీ వైరస్ రహితంగా మార్చుకోవచ్చు అంటున్నారు.
ఇతర రసాయనాలను కూడా లేకుండా శుభ్రంచేయడం దీని ప్రత్యేకత. ఓజోన్ పంపింగ్ విధానం వల్ల వస్తువులు శుభ్రమవుతాయి. ఈ ఫ్రిడ్జ్‌ను పూర్తిస్థాయిలో తయారుచేసి మార్కెట్‌లోకి తీసుకొస్తామని హరినాథ్ తెలిపారు. కరోనా విజృంభణ వేళ ఓజోనిట్ వంటి పరికం ఉంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.