డాక్టర్ హుస్సేన్‌ కిడ్నాప్‌ కేసులో కొత్త ట్విస్ట్

Update: 2020-10-28 06:58 GMT

హైదరాబాద్‌ డాక్టర్ హుస్సేన్‌ కిడ్నాప్‌ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. బంధువులే హుస్సేన్‌ను కిడ్నాప్‌ చేయించారని గుర్తించారు పోలీసులు. హుస్సేన్ అకౌంట్‌లో భారీ మొత్తంలో నగదు ఉందని తెలుసుకున్న బంధువు ముస్తఫా హుస్సేన్‌ ఇంటిపై అద్దెకు ఉంటున్న ఖలీల్‌ అనే వ్యక్తితో కిడ్నాప్‌ ప్లాన్‌ చేశాడు. పథకం ప్రకారం నిన్న సాయంత్రం హైదరాబాద్‌ ఎక్సైజ్‌ కాలనీలో హుస్సేన్‌ను కిడ్నాప్‌ చేయించాడు.

కిడ్నాప్‌ చేసిన అనంతరం హుస్సేన్‌ కుటుంబసభ్యులకు వాట్సాప్‌ కాల్‌ చేసి డబ్బు డిమాండ్ చేశాడు ముస్తఫా. బిట్‌ కాయిన్‌ రూపంలో డబ్బు ఇవ్వాలని లేని పక్షంలో హుస్సేన్‌ను చంపేస్తామంటూ బెదిరించాడు. దీంతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు హుస్సేన్ బంధువులు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముస్తఫా ఫోన్‌ చేసిన నెంబర్‌ను ట్రేస్ చేశారు. ఖలీల్‌ను విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితులు అనంతపురం మీదుగా బెంగళూరు వెళ్తున్నట్టు గుర్తించారు. వెంటనే ఏపీ పోలీసు యంత్రాంగానికి సమాచారమిచ్చారు.

హైదరాబాద్‌ పోలీసుల సమాచారంతో అప్రమత్తమైన ఏపీ పోలీసు యంత్రాంగం చాకచక్యంగా వ్యవహరించింది. అనంతపురం జిల్లా ఎస్పీ సత్యయేసుబాబుకు పూర్తి విషయాన్ని వివరించారు అధికారులు. వెంటనే అలర్టయిన ఎస్పీ కిడ్నాపర్ల కదలికపై జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపట్టారు. తపోవనం దగ్గర తనిఖీలు చేస్తుండగా ఓ వాహనం ఆగకుండా వేగంగా వెళ్లడాన్ని గుర్తించిన పోలీసులు దానిని వెంబడించారు. రాప్తాడు మండలం బుక్కచర్ల దగ్గర చేజ్ చేసి వాహనాన్ని పట్టుకున్నారు పోలీసులు.

ఎట్టకేలకు కిడ్నాపర్ల చెర నుంచి డాక్టర్ హుస్సేన్‌ను రక్షించారు అనంత పోలీసులు. ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో నలుగురు ముఠా సభ్యులు పరారీలో ఉన్నట్టు వెల్లడించారు. కిడ్నాపర్‌ నుంచి రివాల్వర్, కత్తి, మత్తు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. కర్నాటకకు చెందిన కిడ్నాప్‌ గ్యాంగ్‌గా అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు పరారైనవారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.

హైదరాబాద్ ఎక్సైజ్‌ అకాడమీ దగ్గరలోని క్లినిక్‌ నుంచి తనను ఎత్తుకెళ్లారని అంటున్నారు బాధితుడు హుస్సేన్. తొలుత ఓ గదిలో నిర్బంధించారని ఆ తర్వాత చిత్రహింసలకు గురిచేశారని వెల్లడించారు. కొంత సమయం తర్వాత చేతులు, కాళ్లు తాళ్లతో కట్టేసి ముఖానికి ముసుగు వేసి కారులో ఎక్కించారన్నారు బాధితుడు హుస్సేన్.

Tags:    

Similar News