Coronavirus: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా భయం
Coronavirus: తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది.
Coronavirus: తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. ఏపీ, తెలంగాణలో పాఠశాలలను తిరిగి ప్రారంభించడంతో స్కూల్సే హాట్ స్పాట్స్‌గా కోవిడ్ శరవేగంగా విస్తరిస్తోంది. దాంతో, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్ధులు వైరస్ బారిన పడుతున్నారు. ఏపీ, తెలంగాణలో పలుచోట్ల కరోనా కేసులు బయటపడటంతో అక్కడక్కడ స్కూళ్లను మూసేసి రెడ్ జోన్స్‌గా ప్రకటిస్తున్నారు. మరోవైపు, వైద్యారోగ్యశాఖ స్కూళ్లలో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తూ టీచర్లు, స్టూడెంట్స్‌ను అప్రమత్తం చేస్తోంది. అయితే, చాపకింద నీరులా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో టీచర్స్, స్టూడెంట్స్‌తోపాటు ప్రజలు కూడా భయంతో వణికిపోతున్నారు.
తూర్పుగోదారి జిల్లా మలికిపురంలో కరోనా కలకలం రేపుతోంది. వారం క్రితం ఎంపీయూపీ స్కూల్ లో నలుగురు టీచర్లకు, వంట మనిషికి పాజిటివ్ నిర్థారణ కాగా కొత్తగా మరో 12 మందికి వైరస్ సోకింది. టీచర్లకు వైరస్ పాజిటివ్ కావడంతో అప్రమత్తమైన అధికారులు స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు కరోనా టెస్టులు చేశారు. కొత్తగా 12 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మలికిపురంను పూర్తిగా రెడ్ జోన్ చేసే దిశగా అధికారులు ఆలోచిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో కరోనా స్ట్రెయిన్ కలకలం సృష్టించింది. యూకే నుంచి వచ్చిన ఓ వ్యక్తికి స్ట్రెయిన్ లక్షణాలు ఉండటంతో హైదరాబాద్ లోని టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అతనితో కాంటాక్ట్ అయిన 19 మంది శాంపిల్స్ ను అధికారులు సేకరించారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత పది రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 22 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
ఇటు కరీంనగర్ జిల్లాలోనూ కరోనా కలకలం రేపుతోంది. కరీంనగర్ సుభాష్‌నగర్ ప్రభుత్వ స్కూల్‌లో కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ముగ్గురు టీచర్లు, ఒక టెన్త్ విద్యార్ధికి వైరస్ సోకినట్లు తేలింది. దాంతో, సుభాష్‌నగర్ ప్రభుత్వ స్కూల్ ఉపాధ్యాయులందరూ హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. మరోవైపు వైద్యారోగ్యశాఖ అధికారులు పాఠశాలలో క్యాంప్ ఏర్పాటుచేసి విద్యార్ధులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.