Neera Cafe in Telangana: తాటాకు ఆకృతిలో నీరా కేఫ్..శంకుస్థాపన చేసిన మంత్రులు
Neera Cafe in Telangana: గ్రామీణ వాతావరణం ఉట్టిపడే ఏర్పాట్లతో, అత్యాధునిక హంగులతో నెక్లెస్‌రోడ్డులో నీరాకేఫ్ కొలువుదీరనున్నది. 1800 చదరపు మీటర్ల స్థలంలో రూ.3 కోట్లతో నిర్మించే నీరాకేఫ్‌కు గురువారం శంకుస్థాప జరిగింది. ఓపెన్‌స్పేస్‌లో హుస్సేన్‌సాగర్ వ్యూ కన్పించేలా సీటింగ్ ఏర్పాటు చేస్తున్న నీరాకేఫ్ మొత్తంగా చూస్తే తాటాకు ఆకృతిని పోలి ఉంటుంది. మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ కలిసి రాష్ట్రంలోని తొలి నీరా కేఫ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నీరా స్టాల్ అనేది గౌడ వృత్తి అస్థిత్వానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రజలకు ఆరోగ్యకరమైన నీరాను అందుబాటులోకి తెచ్చేందుకే ఈ స్టాల్ ను ప్రభుత్వం తీసుకువస్తుందని తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని నీరా స్టాల్స్ ఏర్పాటు చేయాలని కేటీఆర్ అన్నారు. కుల వృత్తుల అభివృద్ధితోనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో గీత వృత్తిపై ఆధారపడి 2 లక్షల మంది జీవిస్తున్నారని గుర్తు చేశారు.
అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో కల్లుగీత వృత్తి పన్నును రద్దు చేయడంతో పాటు కల్లు దుకాణాలు తెరుచుకున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో కల్లుగీత వృత్తిపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారని చేశారు. గీత వృత్తిలో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ఇస్తుందని గుర్తు చేశారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, నాయకులు నీరా పానీయాన్ని సేవించారు.
ఇవీ ప్రధాన ప్రత్యేకతలు..
కేఫ్ ముందుభాగంలో ఒకేసారి 20 కార్ల వరకు రోడ్డు వెంట ఆన్‌స్ట్రీట్ పార్కింగ్ చేసుకోవచ్చు, ఎక్కువ వాహనాలు వస్తే లేక్‌వ్యూ పోలీస్‌స్టేషన్ వెంట, పీపుల్స్‌ప్లాజా వద్ద వాహనాలు పార్కింగ్ చేసుకునే వీలుంటుంది.
నీరాస్టాల్‌తోపాటు ఇతర స్టాళ్లలో తెలంగాణ వంటకాలు, తలకాయకూర, బోటి, గుడాలు, పాయా ఇలానోరూరించే వంటకాలు ఉండనున్నాయి.
నీరాకేఫ్‌లో ఒకేసారి మొత్తం 250 మంది వరకు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తారు. హుస్సేన్‌సాగర్‌వైపు కూర్చునే సీట్లను తాటి మొద్దులు, ఈత మొద్దులపై కూర్చున్నట్టుగా అనిపించేలా చెక్కతో చేయనున్నారు.
స్టాళ్లకు రెండువైపులా కొనుగోలుదారులు వచ్చి కొనుగోలు చేసేలా ఏర్పాటు ఉండడం మరింత సౌకర్యవంతంగా ఉండనున్నది.