రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి వారిది

Update: 2021-01-22 09:42 GMT

రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి వారిది

రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి వారిది. రోజు మొత్తం వరి నాట్లు వేసి.. అలసిపోయి సాయంత్రం ఆటోలో ఇళ్లకు బయల్దేరారు. కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనగానే కంటెయినర్‌ రూపంలో మృత్యువు వారిని కబళించింది. ఆటో డ్రైవర్‌ సహా 9 మందిని బలిగొంది. హైదరాబాద్‌- సాగర్‌ రహదారిపై నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట స్టేజ్‌ వద్ద సాయంత్రం 6.20 గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోలో డ్రైవర్‌ సహా మిగిలిన 19 మంది మహిళా కూలీలే.

దేవరకొండ మండలం చింతబాయి గ్రామానికి చెందిన 20 మంది కూలీలు పీఏపల్లి మండలం రంగారెడ్డిగూడెంలో వరి నాట్లు వేయడానికి ఆటోలో వెళ్లారు. పని ముగించుకొని సాయంత్రం తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో అంగడిపేట స్టేజ్‌ వద్ద సాగర్‌ వైపు వెళ్తున్న కంటెయినర్‌ ఓ వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయబోయి ఎదురుగా వస్తున్న ఆటోని ఢీకొట్టి కొద్దిదూరం ఈడ్చుకెళ్లింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు దేవరకొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ఇద్దరు హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 8 మందిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. స్వల్పంగా గాయపడిన మరో ముగ్గురికి దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కంటెయినర్‌ డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండడం, అతివేగంతో ఢీకొట్టడం, ఆటోలో పరిమితికి మించి కూలీలు ఉండటంతో మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. మృతులను దేవరకొండ ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించడంతో ఆస్పత్రి ప్రాంగణమంతా వారి బంధువుల రోదనలతో నిండిపోయింది.

ప్రమాదంలో ఆటో డ్రైవర్‌, కూలీ కొట్టం మల్లేశ్‌‌తో పాటు అతడి భార్య చంద్రకళ, తల్లి పెద్దమ్మ మృతిచెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మల్లేశ్‌, చంద్రకళ దంపతులకు 10, 7 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులున్నారు. తల్లిదండ్రులు, నాయనమ్మ మృతితో ఆ చిన్నారులు దిక్కులేనివారయ్యారు. తమ చుట్టు పక్కల గ్రామాల్లో రోజు కూలి 250 ఇస్తున్నారని రంగారెడ్డిగూడెంలో 400 రూపాయల కూలి ఇస్తుండటంతో 20 మందిమి ఆటోలో వెళ్లామని తెలిపారు.

Tags:    

Similar News