ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లో ఘనంగా ప్రారంభమైన నాగోబా జాతర
Adilabad: పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి ప్రత్యేక పూజలు
Adilabad: ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లో ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర శుక్రవారం అర్ధరాత్రి వైభవంగా ప్రారంభమైంది. ఉదయం నుంచే మెస్రం వంశీయులు తాము బస చేసిన మర్రిచెట్టు నుంచి పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. కోనేరులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తకుండల్లో పవిత్ర జలం సేకరించి ఆలయానికి తీసుకొచ్చారు. నాగోబాకు అభిషేకం, నైవేద్యం సమర్పించారు మెస్రం వంశస్తులు. ఈ మహాపూజలో మెస్రం వంశస్తులు, ఆదివాసీలు భారీగా పాల్గొన్నారు.
అనంతరం మెస్రం వంశ కొత్త కోడళ్లను నాగోబాకు పరిచయం చేశారు కుల పెద్దలు. పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకుని రాత్రి 9 నుంచి 12 గంటల వరకు గంగాజలంతో ఆలయాన్ని శుద్ధి చేసి నాగోబాకు జలాభిషేకం చేసి మహాపూజ నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు మెస్రం వంశీయులతో కలిసి నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా ఈ ఆదివాసీల మహాజాతర ఈ నెల 15 వరకు కొనసాగనుంది. జాతర ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 12న ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. జాతర ఉత్సవాలు ప్రారంభం కావడంతో.. ప్రజలు వేల సంఖ్యలో తరలివస్తున్నారు.