ఈ నెల 11 నుంచి ప్రారంభంకానున్న నాగోభా జాతర - ఆదిలాబాద్

* ఆదిలాబాద్ లోని కేశ్లపూర్ లోని నాగోభా మహాజాతర

Update: 2021-02-09 07:16 GMT
ఫైల్ ఇమేజ్

ఆదిలాబాద్ లోని కేశ్లపూర్ లోని నాగోభా మహాజాతరకు అధికారులు అనుమతి ఇచ్చారు. కరోనా నేపథ్యంలో ముందుగా జాతరకు పర్మిషన్ ఇవ్వని అధికారులు గిరిజనుల కోరిక మేరకు అనుమతి ఇచ్చారు. ఈ నెల 11 నుంచి నాగోభా జాతర ప్రారంభకానుంది.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో కొలువైన నాగోబాను తమ కులదైవంగా భావిస్తారు మేస్రం వంశీయులు. ప్రతి ఏడాది పుష్య మాసంలో దేశంలోని నలుమూలల నుంచి వచ్చి తమ ఇష్ట దైవాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. సర్పజాతిని సంప్రదాయంగా పూజించడమే ఈ నాగోబా జాతర ప్రత్యేకత.

పుష్య మాసంలోని అమావాస్య రోజు తమ ఆరాధ్య దైవం నాగోబా పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనుల నమ్మకం. అమవాస్య రోజు రాత్రి పన్నెండు గంటల మధ్య కాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడనీ, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనులు విశ్వసిస్తారు. అందుకే ఏటా హస్తినమడుగు నుండి తీసుకువచ్చిన పవిత్ర గోదావరి జలంతో "మహాభిషేకం" చేస్తారు. అనంతరం జాతర ప్రారంభమవుతుంది.

నాగోబా జాతరలో భాగంగా గిరిజనులు తెల్లటి వస్త్రాలు ధరించి నియమ నిష్టలతో కళ్ళకు చెప్పులు లేకుండా దట్టమైన అటవీ మార్గం గుండా ప్రయాణించి గోదావరి నదీమా తల్లికి ప్రత్యేక పూజలు చేసి తిరుగుప్రయాణంలో ఇంద్రవెల్లిలోని ఇంద్రాయికి పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుండి కేస్లాపూర్ లోని నాగోబా ఆలయ ప్రాంగణానికి చేరుకొని అక్కడి మర్రిచెట్టు వద్ద ఓ చెట్టుకు గోదావరి జలాలను కట్టి పెడతారు. మూడు రోజులపాటు మర్రిచెట్టు కిందే బసచేస్తారు. తమ పూర్వీకులకు కర్మకాండలునిర్వహించి పిండా ప్రదానం చేస్తారు. తర్వాత పవిత్ర జలాలతో గర్భగుడిలోని నాగోబాకు అభిషేకం చేస్తారు.

కేస్లాపూర్ లోని నాగోబా చరిత్రను గోండు గిరిజనులు రకరకాలుగా చెప్పుకుంటారు. పూర్వం మేస్రం కుటుంబానికి చెందిన నాగాయిమోతి రాణికి నాగేంద్రుడు కలలో కనిపించి సర్పం రూపంలో ఆమె గర్భాన జన్మిస్తానని చెప్పాడని, ఆ కల నిజమైందని గోండుల నమ్మకం. ప్రతిఏటా పుష్ట మాసం అమావాస్య రోజున నాగేంద్రుడు ప్రత్యక్షమవుతాడని గిరిజనుల నమ్మకం. నాగోబా దేవతకు పూజలు మేస్రం వంశీయులే నిర్వహిస్తారు.

పూర్వం మేస్రం కుటుంబానికి చెందిన నాగాయిమోతి రాణికి నాగేంద్రుడు కలలో కనిపించి సర్పం రూపంలో ఆమె గర్భాన జన్మిస్తానని చెప్పాడని, ఆ కల నిజమైందని గోండుల నమ్మకం. సర్పరూపంలోని నాగేంద్రునికి తల్లి అంటే రాణి తన తమ్ముడి కూతురు గౌరీతో వివాహం జరిపించింది. అత్త ఆజ్ఞ మేరకు గౌరీ భర్తను బుట్టలో పెట్టుకొని గోదావరికి ప్రయాణం కాగా, ఒకచోట పాము ఉడుం రూపంలో కనిపించగా ఆ ఊరు ఉడుంపూరైంది. ఆ తరువాత గౌరి ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లగా ఆమెను చూసి నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారాడని, అయితే పేరు ప్రతిష్ఠలు కావాలో, సంప్రదాయం కావాలో తేల్చుకోమనగా గౌరి సంప్రదాయాలను లెక్కచేయక పోవడంతో తిరిగి పాముగా మారాడని కథ. ఆ తరువాత ఉడుంపూర్‌ నుంచి గరిమెల వరకు అతనికోసం వెతికిన గౌరి గోదావరిలోనే సత్యవసి గుండంలో కలిసిపోయిందని, నాగేంద్రుడు ఆమె వెంట ఉంచిన ఎద్దు రాయిగా మారిందని భక్తుల విశ్వాసం. ఆ తరువాత పెళ్ళి అయిన ప్రతి జంటకు నాగేంద్రుడి సన్నిధిలో పరిచయం చేయాలని (పేథికొరి యాక్‌) చెప్పి నాగేంద్రుడు కెస్లాపూర్‌ గుట్టల్లోకి వెళ్లిపోయాడని చెప్తుంటారు. అదే కెస్లాపూర్‌ గ్రామంగా మారి పోయింది. నాగేంద్రుడు వెళ్లిన గుట్ట వద్ద నాగోబా దేవాలయాన్ని నిర్మిం చారు. ప్రతిఏటా పుష్ట మాసం అమావాస్య రోజున నాగేంద్రుడు ప్రత్యక్షమవుతాడని గిరిజనుల నమ్మకం.

మేస్రం వంశీయులు నాగోబా అభిషేకం నుండి నైవైద్యం వరకు సంప్రదాయలు పాటిస్తారు.. మహేభిషేకం సందర్బంగా నాగేంద్రునికి నైవేద్యాలు పెడతారు. నైవేద్యాల కోసం 22 పోయ్యిలను ఏర్పాటు చేసి వంటకాలు చేస్తారు. నాగోభా దేవుడికి జలం తీసుకురావడానికి కుండలను సిరికోండ మండలంలోని ఒక ఇంటి నుండి మాత్రమే తీసుకుంటారు.

మేస్రం వంశస్థులునేటికి ఒకరితో ఒకరు బంధాలు, అనుబంధాలు ప్రేమ అప్యాయతలు పంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇందులో భాగంగా జాతర ప్రారంభమైన తర్వాత కొత్త కోడళ్ల పరిచయం కార్యక్రమం నిర్వహిస్తారు. దీనిని బెటింగ్ కియా వాల్ అంటారు.

మెల్లగా జరుగుతున్న నాగోభా ఆలయం పునర్ నిర్మాణం పనులు జాతర సమీపిస్తుండడంతో వేగం పుంజుకున్నాయి. మూడేళ్ల క్రితమే ఈ ఆలయం పనులు పూర్తి కావాలి. జాతర ప్రారంభమయ్యేలోపు గర్భగుడితో పాటు ఆలయ ప్రాంగణం పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

పుష్యమాసం అమావాస్య రోజున ఆదిశేషునికి గోదావరి నదినుండి తెచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహిండంతో నాగోబా జాతర ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అయిదు రోజులపాటు జరిగే ఈ జాతరకు మన రాష్ట్రంతో పాటు మధ్యప్రదేశ్ ఛత్తీస్ గడ్ మహారాష్ట్ర నుండి వేలాదిమంది భక్తులు తరలివస్తారు. కరోనా నేపథ్యంలో ముందుగా నాగోబా జాతరను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మహా పూజలు మాత్రమే అనుమతిచ్చారు. గిరిజనుల కోరిక మేరకు నాగోభా జాతరకు అధికారులు అనుమతి ఇచ్చారు. 

Tags:    

Similar News